బిడ్డ చిన్నగా పుట్టాలని.. పొగ తాగుతున్నారు..
అమ్మతనం ఒక వరం.. అటువంటి వరం అందక కొంత మంది మహిళలు పడే బాధ వర్ణనాతీతం..కానీ, పురుడు పోసుకునేప్పుడు ఆ బాధను భరించలేమని..కడుపులోని బిడ్డకు పోషకాల బదులు.. సిగిరెట్ పొగను ఇస్తూ కుచించుకు పోయేలా చేసే మహిళలను చూశారా?
పుట్టే బిడ్డ బాగా ఎదిగి, బలంగా ఉంటే పురిటి నొప్పుల బాధ ఎక్కువగా ఉంటాయని, బిడ్డ పరిమాణం తగ్గించేందుకు ఆస్ట్రేలియాలోని మహిళలు గర్భం ధరించిన నాటి నుంచి ఎక్కువగా పొగ తాగుతున్నట్లు ఓ సర్వే తేల్చింది. బిడ్డ బరువు, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడం, నొప్పి నుంచి ఉపశమనం తదితరాల కోసం ఈ పని చేస్తున్నట్లు వారు తెలిపినట్లు సర్వే సంస్థ వివరించింది.
దాదాపు 10 ఏళ్లపాటు ఆస్ట్రేలియాలోని పొగ తాగేవారి మీద చేసిన పరిశోధనలో ఈ భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. పదహారేళ్ల వయసు నుంచే అమ్మాయిలు పొగ తాగడం మొదలు పెడుతున్నట్లు చెప్పింది. గర్భం దాల్చితే పురిటిలో తీవ్రమైన నొప్పులు వస్తాయనే వారు పొగ తాగుతున్నట్లు వెల్లడించినట్లు తెలిపింది. పొగ తాగడం కారణంగా బిడ్డల బరువు తగ్గుతుందని సిగిరెట్ ప్యాకెట్ల మీద చూడటం వల్లే ఇలా చేస్తున్నట్లు వారు చెప్పడం గమనార్హం.
గర్భం దాల్చిన స్త్రీలు బలహీనంగా ఉండటమే వారి భయానికి కారణంగా సర్వే సంస్థ భావిస్తోంది. గర్భం దాల్చడాన్నే కారణంగా చూపిస్తూ సిగిరెట్ తాగడాన్ని అలవాటు చేసుకుంటున్న మహిళలు ఎందరో భయంతో రోజులో ఎక్కువ సంఖ్యలో సిగిరెట్లను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది.