smart district
-
స్మార్ట్ జిల్లాగా కృష్ణా
టీమ్ వర్క్‌తో రాజధాని ఏర్పాటుకు కృషి ‘సాక్షి’తో కొత్త కలెక్టర్ బాబు.ఎ నేడు బాధ్యతల స్వీకరణ మచిలీపట్నం : కృష్ణాను స్మార్ట్ జిల్లాగా రూపుదిద్దేందుకు తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తానని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని శాఖల అధికారులను ఒకేతాటిపైకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించేలా అధికారులను సమాయత్తం చేస్తానన్నారు. బందరు పోర్టు భూసేకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో తాను సీఎం చంద్రబాబును కలిశానన్నారు. ఆయన సూచనల మేరకు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ పనుల విషయంలో నూతన ఒరవడి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఎక్కువ పని గంటలు చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. రెండు సార్లు ప్రధాని అవార్డు... ఇప్పటివరకు రెండుసార్లు ప్రధానమంత్రి అవార్డు స్వీకరించినట్లు కలెక్టర్ చెప్పారు. 2011లో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు నిత్యావసర సరకుల పంపిణీ విషయంలో, 2013లో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఉపాధి హామీ పనుల విషయంలో ప్రధాన మంత్రి అవార్డులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాకు తాను ఒక కీమేన్‌గా పనిచేస్తూ అధికారులు టీమ్ వర్క్ చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతానన్నారు. -
గోదావరి జిల్లాలకు అన్యాయం చేయను: చంద్రబాబు
ఉభయ గోదావరి జిల్లాలకు తాను అన్యాయం చేయబోనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలస్యమైనా సరే.. పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమగోదావరిని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసైనా సరే ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. నరసాపురం తీరప్రాంతంలో మంచి పోర్టు నిర్మాణం చేపడతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సముద్రంలోకి వెళ్లే నీటిని మాత్రమే మళ్లిస్తామని, రైతులు ఈ విషయంలో అపోహలకు గురికావద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రతినెలా సమీక్ష చేస్తానని అన్నారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని, కొల్లేరు అభివృద్ధికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పశ్చిమగోదావరిని స్మార్ట్ జిల్లాగా మారుస్తామని, చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ విలేజిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.