
గోదావరి జిల్లాలకు అన్యాయం చేయను: చంద్రబాబు
ఉభయ గోదావరి జిల్లాలకు తాను అన్యాయం చేయబోనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలస్యమైనా సరే.. పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమగోదావరిని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసైనా సరే ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. నరసాపురం తీరప్రాంతంలో మంచి పోర్టు నిర్మాణం చేపడతామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సముద్రంలోకి వెళ్లే నీటిని మాత్రమే మళ్లిస్తామని, రైతులు ఈ విషయంలో అపోహలకు గురికావద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రతినెలా సమీక్ష చేస్తానని అన్నారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని, కొల్లేరు అభివృద్ధికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పశ్చిమగోదావరిని స్మార్ట్ జిల్లాగా మారుస్తామని, చాటపర్రు గ్రామాన్ని స్మార్ట్ విలేజిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.