తాడేపల్లిగూడెం సభ అనంతరం గోదావరి జిల్లాల్లో జనసైనికుల డీలా
చంద్రబాబు మాయలో పడి తమను కించపర్చడంపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి
తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో పవన్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం
జారుకుంటున్న ఆశావహులు.. గోదావరి జిల్లాల్లో పడిపోతున్న గ్రాఫ్
తణుకులో స్తబ్దుగా విడివాడ.. కొత్తపల్లి చేరికతో నరసాపురంలో గ్రూపు రాజకీయాలు
వైఎస్సార్‌సీపీలోకి చేగొండి చేరికతో పాలకొల్లు, ఆచంటలో ప్రభావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం: ఎన్నికలు నెలన్నర ఉందనగా జనసేనాని అస్త్రసన్యాసంతో గోదావరి జిల్లాల్లో జనసైనికులు, నేతలు డీలా పడ్డారు. వారాహి యాత్రలో ఊగిపోయే ప్రసంగాలు చేసి తమను ఎన్నికల రణరంగంలోకి దూకమని చెప్పి ఇప్పుడు చంద్రబాబుకు దాసోహమని కాడి వదిలేయడంపై ఆ పార్టీ కేడర్ రగిలిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దున్నేస్తామంటూ హడావుడి చేసిన తమ అధినేత ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ నేతలను, కేడర్‌ను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, కార్యకర్తల్ని ప్రశ్నించవద్దంటూ ఆదేశించడాన్ని ఆ పార్టీ నాయకులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఇప్పుడు పార్టీ శ్రేణులను అవమానించడంతో తమ మనసుల్లో ఆయన పట్ల ఉన్న ప్రతిష్టను దిగజార్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు. జనసైనికులు, కార్యకర్తలు తీవ్ర నిస్పృహలో ఉంటే పవన్ మాత్రం హైదరాబాద్‌లో ఉండి తమాషా చూడడంపై ఆవేదనలో మునిగిపోయారు. తమ అధినేత తీరు ఇలాగే కొనసాగితే పార్టీని, తమను గోదాట్లోకి నెట్టేసినట్లేనని, ఆ పరిస్థితి రాకముందే తట్టాబుట్టా సర్దుకుని జాగ్రత్తపడడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన నేతలు పార్టీ మారుతుండగా.. మరికొందరు ఆ దారిలో ఉన్నారు.
పవన్ ప్రసంగంతో పార్టీలో పెనుదుమారం
ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెం వద్ద నిర్వహించిన జెండా సభలో పార్టీ శ్రేణులను చిన్నబుచ్చుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్నే రేపాయి. ఆయన ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కేడర్ అయోమయంలో పడిపోయింది.
మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నా పార్టీ అధ్యక్షుడిగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో జన సైనికులకు ఎటూ పాలుపోవడం లేదు. 24 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. ఇంతవరకూ ఐదు స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. ఇది జరిగి దాదాపు పదిరోజులవుతున్నా మిగిలిన 19 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించలేని దయనీయ స్థితిలో పవన్ ఉన్నారు.
ఇలాగైతే టీడీపీ ఖాతాలోకి భీమవరం..
ఎన్నికల ప్రచారం మొదలైన తొలినాళ్లలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా వినిపించింది. తాజాగా పిఠాపురం పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ రెండింటిలో ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేది తేల్చుకోలేని పరిస్థితుల్లోకి పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు నెట్టేశారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. భీమవరం నుంచి స్థానికేతరుడిగా ప్రతికూలత ఎదురవుతుందని పవన్‌ను బురిడీ కొట్టించిన చంద్రబాబు భీమవరాన్ని సైతం తన ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేశారని మండిపడుతున్నారు.
అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనసేనలోకి తీసుకుని పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేరుకు జనసేన అయినా టీడీపీ నాయకుడినే పోటీ చేయించడం చంద్రబాబు వ్యూహమంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ అన్నదానిపై పవన్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోతే.. తమ పరిస్థితి ఏంటని వివిధ నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు ఆవేదన చెందుతున్నారు.
ఇంకా ఆ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ముందుచూపుతో ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలు ప్రత్యామ్నాయదారులు వెదుక్కుంటున్నారు. జనసేన ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జి చేగొండి సూర్యప్రకాష్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని, పూర్తిస్థాయిలో సీట్ల ప్రకటన జరిగితే ఆ పార్టీకి మరిన్ని తలనొప్పులు తప్పవంటున్నారు.
పార్టీలో నెంబర్ 3కే సీటు లేకపోతే ఎలా?
రాజమహేంద్రవరం రూరల్ నుంచి పార్టీలో నెంబర్ 3గా ఉన్న దుర్గేష్‌కే సీటని ఇటీవల రాజమహేంద్రవరం పర్యటనలో పవన్ స్వయంగా ప్రకటించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి ఇప్పుడు దుర్గేష్‌ను నిడదవోలుకు సాగనంపి, రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ ఇలా చేస్తారనుకోలేదని దుర్గేష్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రరావు తన భార్యతో సహా ఆమరణ దీక్ష చేస్తే పవన్ నుంచి కనీస స్పందన రాలేదు.
ఒక్క సీటూ ప్రకటించరా?
పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను తణుకు, ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలకు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించేయగా.. వారు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించేశారు. మిగిలిన మూడు సీట్లలో ఎన్ని జనసేనకు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. సొంత సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ మూడు స్థానాల్లో ఒక్క సీటు కూడా జనసేనాని ప్రకటించకపోవడం కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. పొత్తులో భాగంగా ఈసారి ఆ సీటును బీజేపీ అడిగే అవకాశం ఉందంటున్నారు.
ఇక టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీట్లలో అవమానంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. తణుకులో టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు, ఆయన వర్గీయులు తాడేపల్లిగూడెం బహిరంగ సభను బహిష్కరించారు. ఇంతవరకూ ఆయనతో ఎవరూ మాట్లాడలేదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో నరసాపురం జనసేనలో ముసలం రేగింది. నరసాపురం సీటు మత్స్యకార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్‌కు ఇస్తారని భావించగా.. ఆ సీటు తమదేనంటూ సుబ్బారాయుడు వర్గం ప్రచారం చేసుకుంటోంది.
పవన్‌కు నాయకత్వ పటిమ లేదు
సినిమా డైలాగులే తప్ప పవన్‌కళ్యాణ్ వల్ల ఏమీ కాదని అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటంతటి నాయకత్వ పటిమ, గుండెధైర్యం ఉన్నట్లు అనిపించడం లేదు. ముందు భీమవరం అన్నారు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. అక్కడి నుండి పోటీ చేస్తే మాత్రం పవన్‌కు పరాభవం తప్పదు.
ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు పవన్ పోటీలో ఉంటారో లేదో కూడా అనుమానంగా ఉంది. అందుకే భీమవరంలో పులపర్తి అంజిబాబు ఇంటికి వెళ్లి నేను పోటీ చేయకపోతే మీరు చేస్తారా? అని పవన్ బతిమాలారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ నాయకత్వ పటిమ, గుండె ధైర్యం ఏపాటివో అర్థమవుతోంది. – చేగొండి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ నాయకుడు, పాలకొల్లు
జాప్యంతో మరింత చిచ్చు
పొత్తులో జనసేనకు టీడీపీ కేటాయించిన 24 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంలో పవన్‌కళ్యాణ్ జాప్యం చేయడం సరి కాదు. ఈ జాప్యం వల్లే పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు పెరిగిపోయి, కొందరు బయటకు పోతున్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకుండా జాప్యం చేయడం మంచిది కాదు. ఓ కాపు నాయకుడిగా ఈ పరిణామాలు నన్ను కొంత బాధిస్తున్నాయి. – పత్తి దత్తుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, కాపు సంక్షేమ సేన, అంబాజీపేట
Comments
Please login to add a commentAdd a comment