snalis
-
తల తెంచుకొని శరీరాన్ని పెంచుకుంటుంది
తలెత్తుకుని బతకడం తెలుసు.. తలలు తీసుకెళ్తామనే సినిమా డైలాగులూ తెలుసు.. మరి అవసరమైతే తల తెంచేసుకుని బతకడం తెలుసా? అదెట్లా జరుగుతుంది అంటారా.. ఓ జీవికి ఇది సాధ్యమే. తల తెంచేసుకుని.. మళ్లీ శరీరం మొత్తాన్నీ ఫ్రెష్‌గా పెంచుకునే జీవి ఒకదాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రంలో అడుగున జీవించే ఓ రకం నత్తకు ఈ సామర్థ్యం ఉందని తేల్చారు. రెండు వారాల్లోనే.. సాధారణంగా బల్లులు, కొన్నిరకాల చేపలు, చిన్న జంతువులు అవయవాలు కోల్పోతే.. తిరిగి పెంచుకుంటాయని మనకు తెలుసు. వాటి కాళ్లు, తోక వంటివి ఏదో ఒక అవయవానికి సంబంధించి ఈ శక్తి ఉంటుంది. దీనినే ఆటోటోమీ అంటారు. అయితే ఏదో ఒక అవయవం కాకుండా తల ఒక్కదాని నుంచే.. మెడ సహా మొత్తం శరీరాన్ని మళ్లీ పెంచుకునే శక్తి సాకోగ్లోస్సాన్ వర్గానికి చెందిన సముద్ర నత్తలకు ఉందని జపాన్‌లోని నారా విమెన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కూడా పెద్దగా టైం పట్టదని.. రెండు వారాల నుంచి నెల రోజుల్లోపే మొత్తం శరీరం తయారైపోతుందని తేల్చారు. దీని తలలో ఉండే కణాలు.. శరీరంలోని ఏ భాగంగానైనా అభివృద్ధి చెందే శక్తిగలవని (స్టెమ్‌సెల్స్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకు తల తీసేసుకుంటాయి? సముద్రంలో చేపలు, పీతలు, పాములు వంటి జంతువులు ఈ నత్తలను ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి టైంలో బతికి బట్టకట్టేందుకు ఈ నత్తలు తమ తల కింద భాగాన్ని తెంచేసి వదిలేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. నత్తలు తమ శరీరానికి ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర పారసైట్స్ సంక్రమించినప్పుడు కూడా ఇలా శరీరాన్ని వదిలేస్తాయని చెబుతున్నారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
కేన్సర్ చికిత్సలో నత్తలు..!
కాన్బెర్రా: సముద్రపు నత్తల గ్రంధులు స్రవించే జిగురు కేన్సర్ వ్యాధి చికిత్సకు సమర్థమైన మందుగా ఉపయోగపడుతుందని ఆ్రస్టేలియాలోని ఫ్లిండర్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతోపాటు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడే ఇన్సులిన్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సముద్ర జీవుల్లో మనకు ఉపయోగపడే రసాయనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కేథరీన్ అబోట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. బ్యాక్టీరియా నుంచి రక్షించుకునేందుకు గాను ఆ్రస్టేలియా ప్రాంతంలోని ఒక రకమైన నత్త తన గుడ్లలోకి ప్రత్యేకమైన పదార్థాన్ని విసర్జిస్తున్నట్లు వీరు గుర్తించారు. ఈ పదార్థాన్ని కేన్సర్ కణాలపై ప్రయోగించినప్పుడు అవన్నీ మరణించాయని తెలిపారు. నత్తల జిగురులోని 6-బీఆర్ అనే పదార్థం పేగు కేన్సర్ కణితుల సైజును తగ్గించగలదని ప్రయోగాల ద్వారా వెల్లడైంది. సహజ సిద్ధమైన పదార్థం స్థానంలో తాము కృత్రిమంగా తయారు చేసిన 6-బీఆర్‌ను జంతువులపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించామని కేథరీన్ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఫలితాలను రూఢీ చేసుకుని మానవులపై ఈ రసాయనాన్ని ప్రయోగించేందుకు వీలు ఉందని అంచనా. -
నత్తల పరుగు పందెం!
200లకు పైగా నత్తలు ఈ ఏడాది కాన్గ్ హామ్, యూకే లో జరిగిన ప్రపంచ నత్తల చాంపియన్ షిప్ లో పాల్గొన్నాయి. 13 ఇంచ్ ల దూరాన్ని దాదాపు 3 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసిన హెర్బీ అనే నత్త ఈ ఏడాది చాంపియన్ గా అవతరించింది. గత 25 ఏళ్లగా నత్తల చాంపియన్ షిప్ కు కాన్గ్ హామ్ వేదికగా నిలుస్తోంది. అంతేకాకుండా మేలు జాతి నత్తలకు కాన్గ్ హామ్ పేరుగాంచింది. కాగా, 2 నిమిషాల్లోనే రేసును పూర్తి చేసిన ఘనత 9 ఏళ్ల వయసు కలిగిన థామస్ విన్సెంట్ అనే నత్త పేరిట ఉంది. నత్తల పోటీల్లో పాల్గొంటున్నవారిలో ఎక్కువమంది పిల్లలే ఉంటున్నారు. నత్తలను పెంచుతూ.. ట్రైనింగ్ ఇస్తూ ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్నారు.