తలెత్తుకుని బతకడం తెలుసు.. తలలు తీసుకెళ్తామనే సినిమా డైలాగులూ తెలుసు.. మరి అవసరమైతే తల తెంచేసుకుని బతకడం తెలుసా? అదెట్లా జరుగుతుంది అంటారా.. ఓ జీవికి ఇది సాధ్యమే. తల తెంచేసుకుని.. మళ్లీ శరీరం మొత్తాన్నీ ఫ్రెష్‌గా పెంచుకునే జీవి ఒకదాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రంలో అడుగున జీవించే ఓ రకం నత్తకు ఈ సామర్థ్యం ఉందని తేల్చారు.
రెండు వారాల్లోనే..
సాధారణంగా బల్లులు, కొన్నిరకాల చేపలు, చిన్న జంతువులు అవయవాలు కోల్పోతే.. తిరిగి పెంచుకుంటాయని మనకు తెలుసు. వాటి కాళ్లు, తోక వంటివి ఏదో ఒక అవయవానికి సంబంధించి ఈ శక్తి ఉంటుంది. దీనినే ఆటోటోమీ అంటారు. అయితే ఏదో ఒక అవయవం కాకుండా తల ఒక్కదాని నుంచే.. మెడ సహా మొత్తం శరీరాన్ని మళ్లీ పెంచుకునే శక్తి సాకోగ్లోస్సాన్ వర్గానికి చెందిన సముద్ర నత్తలకు ఉందని జపాన్‌లోని నారా విమెన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కూడా పెద్దగా టైం పట్టదని.. రెండు వారాల నుంచి నెల రోజుల్లోపే మొత్తం శరీరం తయారైపోతుందని తేల్చారు. దీని తలలో ఉండే కణాలు.. శరీరంలోని ఏ భాగంగానైనా అభివృద్ధి చెందే శక్తిగలవని (స్టెమ్‌సెల్స్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎందుకు తల తీసేసుకుంటాయి?
సముద్రంలో చేపలు, పీతలు, పాములు వంటి జంతువులు ఈ నత్తలను ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి టైంలో బతికి బట్టకట్టేందుకు ఈ నత్తలు తమ తల కింద భాగాన్ని తెంచేసి వదిలేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. నత్తలు తమ శరీరానికి ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర పారసైట్స్ సంక్రమించినప్పుడు కూడా ఇలా శరీరాన్ని వదిలేస్తాయని చెబుతున్నారు. –సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment