'హైడీ' ఆమె జీవితాన్ని కాపాడింది!
శునకాలు వాసనల ద్వారానే అన్నింటినీ పసికడతాయి. అలాగే పెంపుడు జంతువులైతే యజమాని, వారికి సంబంధించిన వ్యక్తులను గుర్తుపడతాయి. ముఖ్యంగా వాటిలో స్నఫింగ్ డాగ్స్ ఎంతో తెలివితేటలను ప్రదర్శిస్తాయన్నది తెలిసిన విషయమే. అందుకే వాటికి పోలీసులు వాసనను గుర్తించడంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. అదే జాతి శునకానికి యజమాని ఇచ్చిన ట్రైనింగ్... ఇప్పుడు ఏకంగా అమె జీవితాన్నే రక్షించింది. క్యాన్సర్ బారినుంచీ బయట పడేసింది.
యజమానిపై అత్యంత ప్రేమను చూపించే పెంపుడు జంతువుల్లో శునకాలను ముందు వరుసలో చేరుస్తాం. యజమానులూ వాటిని ప్రాణప్రదంగా చూస్తారు. అయితే మిచిగన్ కు చెందిన 53 ఏళ్ళ ఆన్నె విల్స్... తన పెంపుడు జంతువుకు ఇచ్చిన ట్రైనింగ్... ఆమె జీవితాన్ని ఒడ్డున పడేసింది. ఆమెకు సోకిన రోగాన్ని ముందుగానే గుర్తించిన ఎనిమిదిన్నరేళ్ళ.. జర్మన్ షెఫర్డ్ స్నఫింగ్ డాగ్ 'హైడీ'... యజమాని చుట్టూ ఆవేదనతో తిరగడం ప్రారంభించింది. పదే పదే ఆమె ఛాతీపై వాసన చూడటం మొదలు పెట్టింది.
దీంతో విషయం అర్థంకాక ఆన్నె విల్స్ ఆందోళన చెందింది. తన పెంపుడు కుక్కకు ఏమైందోనని కంగారు పడింది. హైడీకి ఎనిమిదేళ్ళపాటు... తప్పిపోయినవారిని, పెంపుడు జంతువులను వాసనను బట్టి గుర్తించడంలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే హైడీ పదే పదే తన ఛాతీపై వాసన చూడటం మాత్రం ఆ యజమానికి ఎంతో అనుమానం కలిగించింది. దీంతో హైడీని ఓ ప్రముఖ మెటర్నిటీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి దానికేమైందోనని అన్ని పరీక్షలూ చేయించింది. వైద్యులు హైడీ ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి సమస్యా లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే ఎందుకలా చేస్తోంది అన్న అనుమానం మాత్రం ఆన్నె విల్స్ ను వీడలేదు. ఎందుకైనా మంచిదని ఆమె కూడా పరీక్షలు చేయించుకుంది.
''హైడీ నా జీవితాన్ని రక్షించింది. అదే కనుక నా రోగాన్ని గుర్తించకపోయి ఉంటే ఈ పాటికి శవంగా మారేదాన్ని'' అంటూ పదే పదే గుర్తు చేసుకుంటోంది యజమాని ఆన్నె. ఒకవేళ హైడీ కనుక గుర్తించకపోయి ఉంటే.. ఆన్నె విల్స్ కు సోకిన లంగ్ క్యాన్సర్.. శరీరంలోని మిగిలిన అన్నిభాగాలకూ సోకి ఉండేదని, ముందుగానే తెలియడం వల్ల ఈ జబ్బును నయం చేసే అవకాశం ఉందని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్సర్ కోలే చెప్పారు. ఎక్కడైతే పదే పదే హైడీ వాసన చూసిందో అదే స్థానంలో ఆమెకు లంగ్ కాన్యర్ ఉండటం వైద్యులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపై మీరు రెండు పీహెచ్ డీలు చేసిన వైద్యుల సమక్షంలో ఉన్నట్టుగా హైడీని చూసి ఫీలవ్వచ్చు అంటూ సెయింట్ ఆగ్నెస్ ఆస్పత్రి ఆంకాలజీ ఛీఫ్ అనడం విశేషం.
నిజంగానే ఓ శునకం వైద్యులకన్నా వేగంగా రోగాన్ని గుర్తించడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు హైడీకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు.. దాని ముక్కు ఎంతో గ్రహణ శక్తిని కలిగి ఉండటం నిజంగా ఎంతో గ్రేట్ అని ఏకంగా డాక్టర్లే మెచ్చుకుంటున్నారు. ఆన్నె విల్స్ నిర్వహిస్తున్న డాగ్స్ ఫైండింగ్ డాగ్స్ సేవాకార్యక్రమంలో భాగంగా ఏడేళ్ళలో సుమారు 2 వేల వరకూ తప్పిపోయిన పెంపుడు జంతువులను హైడీ గుర్తించింది. పెంపుడు శునకం.. యజమానిపై విశ్వాసాన్ని చూపడమే కాదు.. ఏకంగా ఆమె జీవితాన్నే రక్షించడంతో ఆన్నే విల్స్ ఎంతో ఆనందంలో తేలిపోతోంది.