నిఘా నిద్ర
భద్రత డొల్ల..
సిటీ రైల్వే స్టేషన్లో నామమాత్రంగా సీసీ కెమెరాలు
ఆర్పీఎఫ్ను పీడిస్తున్న సిబ్బంది కొరత
అధునాతన ఆయుధాలు శూన్యం
బాంబులు గుర్తించడంలో సిబ్బందికి శిక్షణ కరువు
కనీసం అందుబాటులో లేని స్నిఫర్ డాగ్స్
సాక్షి, బెంగళూరు : సిలికాన్ సిటీ, దేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరులో నిఘా నిద్ర పోతోంది. ఇక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి. ఉగ్రవాదులు బెంగళూరుపై కన్ను వేశారనే వార్తలు వెలువడుతున్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడే తప్ప ముందస్తు ప్రణాళికలు ఏవీ అటు హోంశాఖ వద్ద కాని.. ఇటు రైల్వే శాఖ వద్ద కాని లేవు. చెన్నై రైల్వే స్టేషన్లోని బెంగళూరు-గౌహతి రైలులో గురువారం ఉదయం జరిగిన బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే.
వారు ఇక్కడి సిటీ రైల్వే స్టేషన్, యశ్వంతపురం, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లను పరిశీలించారు. సిటీ రైల్వే స్టేషన్లో 120 సీసీ కెమెరాలు ఉండగా.. అందులో 40 సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తేలింది. ఇక యశ్వంతపురం, కంటోన్మెంట్ స్టేషన్లో కేవలం మెటల్ డిటెక్టర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తించడానికి సీఐడీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీ రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద సెక్యూరిటీ కొంత వరకూ బాగానే ఉన్నా.. అనధికారికంగా స్టేషన్లోపలికి రావడానికి దాదాపు 20 చోట్ల అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితులు బాంబు తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఇలాంటి చోటు నుంచే తరలించి ఉంటారని భావిస్తున్నారు.
సిబ్బంది కొరత..
రైళ్లలో భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అంతేకాకుండా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు అవసరమైన అధునాతన ఆయుధాలు కూడా ఆర్పీఎఫ్ వద్ద లేవు. ఆ సిబ్బందికి బాంబులు గుర్తించే విషయంపై శిక్షణ ఉండదు. బాంబు నిర్వీర్య దళంతో పాటు స్నిఫర్ డాగ్స్ కూడా అందుబాటులో ఉండదు.
ఏదైనా ప్రమాదం జరగబోతోందని నిఘా వర్గాలు హెచ్చరించినప్పుడు వారు పోలీసు శాఖను సంప్రదించి సహకారం తీసుకుంటారు. దీంతో పేలుడు పదార్థాలు గుర్తించడంలో ఆర్పీఎఫ్ పూర్తిగా విఫలమవుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎంఎన్ రెడ్డితో మధ్యప్రదేశ్ ఆర్పీఎఫ్ విభాగపు ప్రత్యేక డెరైక్టర్ జనరల్ మైథిలి బెంగళూరులో సోమవారం భేటీ కానున్నారు. ఎంఎన్ రెడ్డి కర్ణాటక ఆర్పీఎఫ్ విభాగపు ఇన్చార్జ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.