sobhan Sarkar
-
కలలో మాట.. బంగారం వేట!
నమ్మే పిచ్చోళ్లు ఉంటే.. నాపరాయిని చూపించి వజ్రం అన్నాడట వెనకటికొకడు. ఉత్తరప్రదేశ్ బంగారు వేట వ్యవహారం అచ్చం అలాగే ఉంది. మన దేశంలో బాబాలు, బతికున్న దేవుళ్లకు ఏమాత్రం కొదవలేదు. వాళ్లు చెప్పిన మాటలను పట్టుకుని నిప్పుల్లో దూకడం లాంటి పిచ్చిపనులు చేసేవాళ్లకు కూడా కొదవ లేదు. కానీ.. ఏకంగా ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కదిలిపోయి జీఎస్ఐ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని బంగారం ఉందంటూ తవ్వకాలు మొదలుపెట్టడం.. నిజంగా ఎంత పిచ్చిపనో అనిపిస్తుంది. వెయ్యి టన్నుల బంగారం ఉందని ఓసారి, 2,500 టన్నులు ఉందని ఇంకోసారి చెబుతూ స్వామి శోభన్ సర్కార్ జనాన్ని పిచ్చివాళ్లను చేస్తున్నాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు కూడా తమకు ఇక్కడేదో లోహం ఉందని చెప్పడం వల్లే తాము తవ్వకాలు చేస్తున్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్‌బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించడం దీనంతటికీ మూలం అయ్యింది. శుక్రవారం నుంచి ఆ కోటలో ఏఎస్ఐ బృందం తవ్వకాలు మొదలుపెట్టింది. అక్కడేం జరుగుతోందో చూసేందుకు జనం కట్టలు కట్టుకుని మరీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సాధువు కన్న కల నిజం కావాలని, ప్రతి జిల్లాలో ఓ బంగారు నిధి ఉండాలని అంటున్నారు!! కేవలం ఒక సాధువుకు వచ్చిన కలను పట్టుకుని, ఆయన చెప్పిన మాటల ఆధారంగా కోటలో తవ్వకాలు చేస్తున్న ప్రభుత్వం.. దానిమీద పెట్టే ఖర్చుతో ఎంతమందికి కూడు, గూడు, గుడ్డ లాంటివి అందించవచ్చో ఆలోచించడంలేదు. పైపెచ్చు, భూమిని తవ్వేందుకు పలుగులు, పారలతో సిబ్బంది బయల్దేరడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోనే ఫతేపూర్ జిల్లా ఆదాంపూర్ గ్రామంలో కూడా మరో 2,500 టన్నుల బంగారం ఉందని, అక్కడ తవ్వకాలకు కావాలంటే తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని సాధువు శోభన్ సర్కార్ చెబుతున్నారట. అసలాయనకు ఆ 10 లక్షలు ఎక్కడివో, దానికి ఇన్నాళ్లూ ఆదాయపు పన్ను కట్టారో లేదో తేలిస్తే ఇలాంటి కూతలు ఆగుతాయని భావిస్తున్నారు. -
దేశ ఆర్థిక ఇబ్బందులు తీరే కల!
ఉత్తరప్రదేశ్‌లోని దౌండి యాఖేరా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఊరు. ఇక్కడ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిధి వేట గురించి అందరూ ఎంతో ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ వేట వెనుక ఒక స్వామీజీ కల ఉంది. ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన పేరు స్వామి శోభన్సర్కార్. చాలా సంవత్సరాల కిందటే సన్యాసాన్ని స్వీకరించారు. బస ఒక పాడుబడిన గ్రామ సమీపంలోని ఆలయంలో. ఇటీవల తనకు కలలో ఒక నిధి రహస్యం తెలిసిందని ఆయన వెల్లడించడంతో స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి నిధివేట మొదలుపెట్టింది! కొంతమంది దీన్ని జోక్‌గా తీసుకొంటున్నారు. ఆ స్వామీజీ ఎవరో గానీ నోటికొచ్చింది చెబితే మాత్రం ఇలా నిధివేటకు పూనుకోవడం ఏమిటని ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇంతకీ ఈ విషయంపై స్వామీజీ ఏమంటున్నారు? ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుండటం నన్ను చాలా బాధించింది. ఈ విషయంలో ప్రధానమంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆందోళన చెందుతుండటాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. నా గురువులు భాస్కరానందజీ, సత్సంగానందజీలు నాకు కలలో కనిపిస్తే వారితో ఈ విషయం గురించి ప్రస్తావించాను. వారు దౌండి యా ఖేరాలోని ఓ సమాధి సమీపంలో నిక్షిప్తమై ఉన్న గుప్త నిధి గురించి సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో నేను ప్రధానమంత్రికి ఈ నిధి గురించి లేఖ రాశాను. నిధి దొరకడం ఖాయం.. దేశానికి కష్టాలు తొలగడం ఖాయం...’’ అని స్వామిజీ హామీ ఇస్తున్నారు. దాదాపు నెల కిందట ఈ బాబా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు! తనకు ఒక నిధి సమాచారం గురించి తెలుసునని, తాను చెప్పిన చోట తవ్వితే రెండు వేల టన్నుల బంగారం దొరుకుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ లేఖను నిర్లక్ష్యం చేయలేదు! ఎవరో పనిలేని వ్యక్తి ఇలాంటి లేఖ రాశాడని వారు దాన్ని పక్కన పడేయలేదు. బహుశా.. కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన భారీ నిధి ప్రభావం కాబోలు... ఎందుకైనా మంచిదన్నట్టుగా బాబా ఉంటున్న ప్రాంతంలోని ప్రభుత్వాధికారులను అప్రమత్తం చేశారు. ఆ కథేంటో తెలుసుకొమ్మని పురమాయించారు. ఇక్కడ నుంచి కథ ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ఇండియా (ఏఎస్ఐ) నిపుణులు ఆగమేఘాల మీద దౌండియా చేరుకొన్నారు. స్వామిజీని కలిసి.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నిధి అన్వేషణ మొదలుపెట్టారు. కండిషన్లున్నాయి... ఈ నిధి గురించి సమాచారం ఇచ్చిన బాబా కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఈ నిధి విషయంలో తనకు, తమ గురువులకు సరైన ప్రాధాన్యతను ఇవ్వకపోతే.. అంతే సంగతులు అని ఆయన అంటున్నారు. తమ గురువుల అనుమతి లేనిదే ఎవరూ ఈ నిధిని టచ్ కూడా చేయలేరని, ఇంతేగాక ప్రభుత్వం తన సూచనలు పాటిస్తే.. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలపడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఈ నిధి విషయంలో స్వామిగారి కల నిజమైతే.. ఈయన ప్రత్యక్ష దైవమే అవుతాడేమో...!