దేశ ఆర్థిక ఇబ్బందులు తీరే కల! | Sadhu dreams of hidden gold, Archaeological Survey of India to excavate fort in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

దేశ ఆర్థిక ఇబ్బందులు తీరే కల!

Published Thu, Oct 17 2013 11:14 PM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

దేశ ఆర్థిక ఇబ్బందులు తీరే కల!

దేశ ఆర్థిక ఇబ్బందులు తీరే కల!

ఉత్తరప్రదేశ్‌లోని దౌండి యాఖేరా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఊరు. ఇక్కడ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిధి వేట గురించి అందరూ ఎంతో ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ వేట వెనుక ఒక స్వామీజీ కల ఉంది. ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన పేరు స్వామి శోభన్‌సర్కార్. చాలా సంవత్సరాల కిందటే సన్యాసాన్ని స్వీకరించారు. బస ఒక పాడుబడిన గ్రామ సమీపంలోని ఆలయంలో. ఇటీవల తనకు కలలో ఒక నిధి రహస్యం తెలిసిందని ఆయన వెల్లడించడంతో స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి నిధివేట మొదలుపెట్టింది!

కొంతమంది దీన్ని జోక్‌గా తీసుకొంటున్నారు. ఆ స్వామీజీ ఎవరో గానీ నోటికొచ్చింది చెబితే మాత్రం ఇలా నిధివేటకు పూనుకోవడం ఏమిటని ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.  ఇంతకీ  ఈ విషయంపై స్వామీజీ ఏమంటున్నారు? ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుండటం నన్ను చాలా బాధించింది. ఈ విషయంలో ప్రధానమంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆందోళన చెందుతుండటాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. నా గురువులు భాస్కరానందజీ, సత్సంగానందజీలు నాకు కలలో కనిపిస్తే వారితో ఈ విషయం గురించి ప్రస్తావించాను.

వారు దౌండి యా ఖేరాలోని ఓ సమాధి సమీపంలో నిక్షిప్తమై ఉన్న గుప్త నిధి గురించి సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో నేను ప్రధానమంత్రికి ఈ నిధి గురించి లేఖ రాశాను. నిధి దొరకడం ఖాయం.. దేశానికి కష్టాలు తొలగడం ఖాయం...’’ అని స్వామిజీ హామీ ఇస్తున్నారు. దాదాపు నెల కిందట ఈ బాబా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు! తనకు ఒక నిధి సమాచారం గురించి తెలుసునని, తాను చెప్పిన చోట తవ్వితే రెండు వేల టన్నుల బంగారం దొరుకుతుందని ఆయన  తన లేఖలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఆ లేఖను నిర్లక్ష్యం చేయలేదు! ఎవరో పనిలేని వ్యక్తి ఇలాంటి లేఖ రాశాడని వారు దాన్ని పక్కన పడేయలేదు. బహుశా.. కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన భారీ నిధి ప్రభావం కాబోలు... ఎందుకైనా మంచిదన్నట్టుగా బాబా ఉంటున్న ప్రాంతంలోని ప్రభుత్వాధికారులను అప్రమత్తం చేశారు. ఆ కథేంటో తెలుసుకొమ్మని పురమాయించారు. ఇక్కడ నుంచి కథ ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్‌ఇండియా (ఏఎస్‌ఐ) నిపుణులు ఆగమేఘాల మీద దౌండియా చేరుకొన్నారు. స్వామిజీని కలిసి.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నిధి అన్వేషణ మొదలుపెట్టారు.
 
కండిషన్లున్నాయి...

 ఈ నిధి గురించి సమాచారం ఇచ్చిన బాబా కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఈ నిధి విషయంలో తనకు, తమ గురువులకు సరైన ప్రాధాన్యతను ఇవ్వకపోతే.. అంతే సంగతులు అని ఆయన అంటున్నారు. తమ గురువుల అనుమతి లేనిదే ఎవరూ ఈ నిధిని టచ్ కూడా చేయలేరని, ఇంతేగాక ప్రభుత్వం తన సూచనలు పాటిస్తే.. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలపడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఈ నిధి విషయంలో స్వామిగారి కల నిజమైతే.. ఈయన ప్రత్యక్ష  దైవమే అవుతాడేమో...!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement