సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన.
సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు.
శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు.
కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు.
ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!)
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి