మహిళల పట్ల సామాజిక దృక్పథం మారాలి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు
అలహాబాద్: మహిళల పట్ల సామాజిక దృక్పథం మారాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. భద్రతగల సానుకూల వాతావరణాన్ని కల్పించినప్పుడే మహిళలు జాతీయాభివృద్ధికి దోహదపడగలరని చెప్పారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదన్నారు. అలహాబాద్‌లో బుధవారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ, దేశంలోని విద్యా నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు వరకు మాత్రమే విద్యాహక్కు పరిమితం కాదని, విద్యార్థుల్లో తగిన పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా దేశాభివృద్ధికి దోహదపడేలా వారిని తీర్చిదిద్దడం కూడా దీని లక్ష్యమని అన్నారు.
దేశంలో పురుషుల కంటే మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉందని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. తరగతి గదుల్లోనే దేశ నిర్మాణ ప్రక్రియ మొదలవుతుందన్న జవహర్‌లాల్ నెహ్రూ మాటలను రాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. ప్రతిభా సామర్థ్యాల్లో మన దేశానికి చెందిన విద్యార్థులు ప్రపంచంలో మరెవరికీ తీసిపోరని అన్నారు. అయితే, విద్యార్థుల్లో విలువలు పెంపొందించేందుకు కూడా కృషి జరగాలన్నారు.