టెక్ మహీంద్రా చేతికి స్విస్ కంపెనీ
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సేవల సంస్థ సాఫ్‌జెన్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తెలిపింది. అయితే, ఒప్పందం విలువ మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ మార్చి నాటికి పూర్తికాగలదని కంపెనీ వివరించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సాఫ్‌జెన్.. కమర్షియల్, రిటైల్ బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలకు సేవలు అందిస్తోంది.
ఇందులో 450 మంది ఉద్యోగులు ఉన్నారు. కస్టమర్లకు అత్యాధునిక కోర్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ డీల్ ఉపయోగపడగలదని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీయంగా నాలుగో అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న టెక్ మహీంద్రా కొన్నాళ్లుగా పలు కంపెనీలను కొనుగోలు చేసింది. ఇటీవలే 240 మిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన లైట్‌బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసింది.