Sofia Richie
-
మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు!
కొంతకాలం ప్రేమించుకొని.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్న యువ పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్- సెలెనా గోమెజ్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారినట్టు కనిపిస్తోంది. ఈ మాజీ ప్రేమికులు తాజాగా ట్విట్టరెక్కి రచ్చచేశారు. ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్నారు. తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సోఫియా రీచి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆపకుంటే.. తన అఫీషియల్ పేజీని మూసివేస్తానని ఈ నెల 14న బీబర్ అభిమానులను హెచ్చరించాడు. ఈ పోస్టుపై సెలెనా ఘాటుగా స్పందించింది. 'నువ్వు అభిమానుల నెగిటివ్ వ్యాఖ్యలను భరించలేకపోతే.. నీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోలను పోస్టు చేయడం మానేయ్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం. అంతేకానీ అభిమానుల మీద వీరంగం వేయకు. వాళ్లు నిన్ను ప్రేమిస్తున్నారు' అని సెలెనా కామెంట్ చేసింది. అనంతరం ఈ కామెంట్ ను తొలగించినప్పటికీ బీబర్ మాత్రం సెలెనా మీద కారాలు మిరియాలు నూరాడు. 'ఒకప్పుడు నన్ను ఉపయోగించుకొని ప్రజల దృష్టిని ఆకర్షించిన వ్యక్తులు ఇప్పుడు నన్నే వేలెత్తి చూపిస్తున్నారు. ఇది నిజంగా ఫన్నీగా ఉంది' అంటూ సెలెనాను విమర్శించాడు. దీంతో 'హ్యాండ్స్ టు మై సెల్ఫ్' సింగర్ సెలెనా మళ్లీ కామెంట్ చేసింది. బీబర్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు అతను తనను ఎన్నోసార్లు మోసం చేశాడని పేర్కొంది. అతడి మోసాలను క్షమించి.. మద్దతుగా నిలిచిన తన మీదనే బీబర్ విమర్శలు చేస్తున్నాడని వాపోయింది. అయినా, అభిమానులు అనేవాళ్లు పిచ్చివాళ్లని, ఏం చేసినా అభిమానిస్తూనే ఉంటారని పేర్కొంది. కొంతకాలంపాటు ప్రేమలో మునిగిపోయి.. చాలా సన్నిహితంగా మెలిగిన బీబర్-సెలెనా 2014లో వేరయిన సంగతి తెలిసిందే. -
'మీరసలు నా ఫ్యాన్సేనా.. ఏంటీ ఈ అసహ్యం'
లాస్ ఎంజెల్స్: ఫ్యాన్స్‌పై అమెరికన్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అలిగాడు. కోపంతో చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తనకు తెలిసిన అమ్మాయిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాస్తంత అలక బుచ్చుకున్నాడు. తన స్నేహితురాలిపై అభిమానులు ఇలాగే కామెంట్స్ చేస్తే తాను ఫ్యాన్స్‌కోసం ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉంచనని, వాటిని ప్రైవేట్‌గా మార్చుకుంటానని చెప్పాడు. ఈ నెల ప్రారంభంలో మోడల్ సోఫియా రిచీతో చెట్టాపట్టాలేసుకొని బీబర్ తిరుగుతున్నాడని, డేటింగ్ చేస్తున్నాడని విపరీతంగా వదంతులు వ్యాపించాయి. బీబర్ ఫ్యాన్స్ సైతం దీనిపై బాగా స్పందిస్తూ అన్ని నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. వాడ కూడని భాష ఉపయోగించారు. దీంతో చిన్నబుచ్చుకున్న బీబర్ 'మీరు నాకు నిజంగా అభిమానులే అయితే ఇలా చేయరు. మీరు ఇలాంటి అసహ్యకరమైన పనులు ఆపకుంటే నా ఇన్‌స్టాగ్రమ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చుకుంటా. నా ఫొటోలు, వీడియోలు ఏవీ మీకోసం పబ్లిక్ గా పెట్టను' అంటూ అతడు తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతోపాటు వారిద్దరి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరు జపాన్ లో ఉన్నారు. ఇక్కడ అతడు త్వరలో రెండు ప్రదర్శనలు ఇవ్వబోతున్నాడు.