చంద్రబాబు విజన్ మారాలి
బషీర్బాగ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును చూసైనా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ‘విజన్-2020’ మార్చుకోవాలని మాల మహానాడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, మాల మహానాడు జాతీయ నాయకులు సోమాద్రి రామూర్తి అన్నారు. గురువారం వారు బషీర్బాగ్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాగే దళితులకు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలను మోసం చేస్తూ బతుకుతున్న మందకృష్ణ మాదిగ తన విధానాన్ని మార్చుకుని దళిత జాతికోసం కలిసి పనిచేయాలని సూచించారు. సమావేశంలో మాలమహానాడు సంయుక్త రాష్ట్రాల కార్యదర్శి కె.మాధవ స్వామి, నాయకులు నక్కెళ్ళ నాగమణి, జయరాజు పాల్గొన్నారు.