నిత్యావసరంగా శానిటరీవేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీ వేర్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ 2014-15లో టర్నోవరులో 20 శాతం వద్ధి ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.1,900 కోట్లు నమోదు చేశామని సంస్థ సీఎండీ ఆర్.కె.సొమానీ తెలిపారు. హింద్‌వేర్ గ్యాలెరియా స్టోర్లను ప్రారంభించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు విలాసంగా భావించిన సానిటరీ వేర్ నేడు నిత్యావసరమైందని అన్నారు. ఉత్తమ జీవన ప్రమాణాలను అందరూ కోరుకుంటున్నారు.
పట్టణాలకు వలసల జోరుతో శానిటరీ వేర్‌కు గిరాకీ పెరుగుతోందని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ల క్ష్యం కార్యరూపం దాలిస్తే ఈ రంగానికి మంచి రోజులు వస్తాయన్నారు. నిధుల లభ్యత విషయంలో ఆర్బీఐ చొరవకుతోడు బ్యాంకుల సైతం విరివిగా గహ రుణాలు ఇస్తున్నాయి. దేశంలో 2 కోట్ల గహాల కొరత ఉంది. పరిశ్రమకు అపార వ్యాపారావకాశాలు ఉన్నాయి’ అని అన్నారు.
ఏటా 8-9 డిజైన్లు..: హెచ్ఎస్ఐఎల్ సుమారు 1,700 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఏటా 8-9 డిజైన్లను ప్రవేశపెడుతోంది. ఉత్పత్తుల ధర రూ.1,000 నుంచి ప్రారంభమై రూ.2.25 లక్షల వరకు ఉంది. హింద్‌వేర్ గ్యాలెరియా స్టోర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 105 ఉన్నాయి. మార్చికల్లా మరో 195 ప్రారంభించనుంది. ఒక్కొక్కటి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ ఔట్లెట్లలో కంపెనీ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. శానిటరీవేర్‌కు రేటింగ్‌ను ప్రవేశపెట్టిన ఘనత తమదేనని కంపెనీ తెలిపింది. లకాసా పేరుతో డిస్ప్లే స్టోర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే యత్నాల్లో కంపెనీ ఉంది.
కొత్త ప్లాంట్లు పెడతాం..
ఈ ఏడాది రెండు ప్లాంట్లను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని సీఎండీ చెప్పారు. కంపెనీల కొనుగోలు హెచ్‌ఎస్‌ఐఎల్‌కు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్లాంటు పెట్టేందుకు సిద్ధమని వెల్లడించారు. గుజరాత్లో 12 లక్షల పీసుల వార్షిక సామర్థ్యంతో రూ.100 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంటు రెండేళ్లలో రెడీ అవుతుందన్నారు. దీంతో సంస్థ సామర్థ్యం 50 లక్షల పీసులకు చేరుతుందని వివరించారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాసెట్స్ తయారీ ప్లాంటు 2016 చివరికల్లా ప్రారంభం అవుతుందని చెప్పారు. కంపెనీకి హర్యానా, నల్గొండ జిల్లా బీబీనగర్ వద్ద సానిటరీ వేర్ తయారీ ప్లాంట్లున్నాయి.
చైనా ఉత్పత్తులతో ముప్పే..
సానిటరీ వేర్ మార్కెట్ పరిమాణం భారత్‌లో వ్యవస్థీకత రంగంలో రూ.3,200 కోట్లకు చేరుకుందని సొమానీ తెలిపారు. ఏటా పరిశ్రమ 15-18 శాతం వద్ధి చెందుతోందని చెప్పారు. చైనా చవక ఉత్పత్తుల ప్రభావం భారత పరిశ్రమపై ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు. పోటీ కారణంగా విభిన్న రకాల మోడళ్లు కస్టమర్లకు లభిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన విషయమేమంటే ఉత్పత్తుల నాణ్యత విషయంలో భారతీయ కస్టమర్లలో అవగాహన పెరగడం దేశీయ కంపెనీలకు కలిసి వచ్చే అంశమని అన్నారు.