పశుగణనకు ఏర్పాట్లు చేసుకోండి
పశుశాఖ డైరెక్టర్ సోమశేఖరన్ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్ : జూలై నుంచి పశుగణన కార్యక్రమం చేపడుతుండటంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సోమశేఖరన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కచ్చితమైన లెక్కలు సేకరించాల్సి కుండటంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వే చేయాలన్నారు. పశువులు, ఎద్దులు, గేదెలు, కోళ్లు, పందులు, గాడిదలతో పాటు అన్ని రకాల జంతుజాలం వివరాలు పక్కాగా ఉండాలని సూచించారు. అందుకోసం బృందాలు, షెడ్యూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఈనెల 26 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు 45 లక్షల జీవాలకు ఉచితంగా నట్టలనివారణ (డీవార్మింగ్) కార్యక్రమం చేపట్టాలన్నారు. వర్షాలు, పశుగ్రాసం తదితర వాటిపై ఆయన ఆరాతీశారు. సీజన్లో ఇప్పటివరకు 8,200 మెట్రిక్ టన్నులు సైలేజ్ బేల్స్, 12 వేల మెట్రిక్ టన్నులు పశుదాణా, 800 మెట్రిక్ టన్నులు దాణామృతం (టీఎంఆర్) గడ్డి రైతులకు సరఫరా చేశామని ఆ శాఖ జేడీ డాక్టర్ జి.సన్యాసిరావు తెలిపారు. ఇంకా 250 మెట్రిక్ టన్నులు బేల్స్, 2 వేల మెట్రిక్ టన్నులు దాణాకు ఇండింట్ ఉందన్నారు. బేల్స్ స్థానంలో కత్తిరించిన మొక్కజొన్న, జొన్నతో తయారు చేసిన ఎండుగడ్డిని కిలో రూ.3 ప్రకారం అందించేందుకు వీలుగా పది రోజుల్లో ప్రకటిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీతో పాటు ఆ శాఖ అధికారులు శ్రీనాథాచార్, ప్రకాష్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.