ఫేస్ బుక్ లో ఆకట్టుకున్న ఘటన!
చాలామందికి నిద్రపోయే ముందు ఓ చిన్నపాటి భయం కలుగుతుంది. నిద్రించే సమయంలో ఇంట్లో ఏం జరుగుతుందోనని, ఉదయం నిద్ర లేచే వరకూ ఎలా ఉంటామోనని భయపడుతుంటారు. కొందరు ఎటువంటి భయం కలగకుండా, మంచి నిద్ర పట్టడంతోపాటు, శుభోదయం కావాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయికి నిజంగానే నిద్రలో ఓ భయంకర అనుభవం ఎదురైందట. మంచి నిద్రలో ఉండగా వినిపించిన శబ్దానికి కళ్ళు తెరచి చూడగా జీవితంలో మరచిపోలేని దృశ్యం కనిపించిందట. దాంతో ఆమె తన అనుభవాలతో కూడిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ కు చెందిన ట్రినా హిబ్బర్డ్.. భయంకర శబ్దం విని, నిద్రలో ఉలిక్కిపడి లేచిందట. తాను ఊహించినట్లుగానే తనకు సమీపంలో ఓ 66 పౌండ్ల బరువు, 16 అడుగుల పొడవు ఉన్న పైథాన్ కనిపించడంతో పై ప్రాణాలు పైకే పోయాయట. ఆ కొండచిలువ తన మంచంమీదినుంచీ టోపీలు పెట్టుకునే షల్ఫ్ మీదుగా ఏకంగా గోడలకు తగిలించిన ఫోటో ఫ్రేములను చుట్టుకుంటూ, ఇంటి పై కప్పుకు చేరిందట. నాలుగేళ్ళక్రితం 2012 లో కూడ ఆమె ఈ పైథాన్ ను చూసిందట. ఇదంతా చూస్తే ఇదేదో దాని స్వంత ప్రాపర్టీలాగా ఉందని, ఇంతకు ముందు కూడా నీటికోసం పూల్ లోకి దిగుతుండగా ఆ పైథాన్ ను చూశానని ఆమె తన ఫేస్ బుక్ కామెంట్ లో రాసింది. అయితే అప్పట్లో దూరంగా చూసి పెద్దగా పట్టించుకోని ట్రినా.. ఇటీవలి ఘటన తర్వాత మాత్రం మరోసారి దానికి ఛాన్స్ ఇవ్వకోడదనుకుంది. అందుకే పాములు పట్టే మాంటీ అనే వ్యక్తిని పిలిచి పట్టించేసిందట.