sona masuri
-
బియ్యం ధరలు పైపైకి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : సన్నం బియ్యం ధరలు గత రెండు నెలల్లోనే ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. బీపీటీ, సోనామసూరి, జేజీలుకు క్వింటాల్‌కు రూ.350 నుంచి రూ.600 వరకు పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటాల్‌కు ధర మార్కెట్లో రూ.3,500 ఉండగా.. ప్రస్తుతం రూ.4,000లకు చేరింది. కొత్త బియ్యానికే ఈ ధర పలుకుతోంది. ఇక పాత బియ్యానికి అదనంగా రూ.300 వరకు చెల్లించాల్సి వస్తోంది. సన్న బియ్యం హెచ్ఎంటీ గతంలో క్వింటాల్‌కు రూ.5,500 ఉండగా.. ప్రస్తుతం రూ.6,000లకు చేరింది. జైశ్రీరామ్ క్వింటాల్‌కు రూ.5,500 నుంచి రూ.6,100కి పెరిగింది. బీపీటీ (బాపట్టా) రూ.3,300 నుంచి రూ.4,000లకు చేరింది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వరి సాగు తగ్గి మార్కెట్‌కు ధాన్యం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి. కరువు కాటు.. జిల్లాలో గడిచినా ఏడాది ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు వరి సాగుకు మొగ్గు చూపలేదు. వరి విత్తనాలు అలికినా నాట్లు వేసుకునే సమయానికి వర్షాలు పడలేదు. దీంతో పొలాల్లోనే నారు వదిలేశారు. రబీ నీరు అందించేందుకు కరెంటు కోత తలెత్తేలా ఉం దని ప్రభుత్వమే వరి సాగు చేసుకోవద్దని సూచించింది. దీంతో పంట వేసుకోలేదు. సాధారణ వరి విస్తీర్ణం 1.45 లక్షల ఎకరాలు కాగా.. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో 59 వేలకే పరిమితమైంది. రబీ సాధారణ వరి విస్తీర్ణం 72 వేల ఎకరాలకు గాను 29 వేల ఎకరాలే సాగైంది. ఇది కూడా ప్రధాన ఆయకట్టు కింద సాగు చేసిందే. ఖరీఫ్‌లో కరువు కాటేస్తే, రబీలో అకాల వర్షా లు దిగుబడి దశలో తీవ్రంగా దెబ్బతిశాయి. ఏటా ఖరీ ఫ్, రబీలో ధాన్యం దిగుబడి 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సుమారుగా అందుబాటులో ఉండేది. కానీ.. ఈ ఏడాది ఖరీఫ్, రబీ కలిపి లక్ష మెట్రిక్ ట న్నులు కూడా అందుబాటులో లేకుండాపోయింది. వరి దిగుబడి అనంతరం రైతుల కోసం తమ వద్ద కొంత నిల్వ చేసేవారు. మిగతా ధాన్యాన్ని మార్కెట్ తరలించేవారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్నదాతకు తినేందుకు తిండిగింజా దొరకని దుస్థితి దాపురించిం ది. ఖరీఫ్, రబీ సాగులో వరితోపాటు కంది, మినము లు, పెసర, శనగ, గోధుమ పంటలదీ అదే పరిస్థితి. సాధారణం కంటే సాగు తగ్గడమే కాకుండా విత్తుకున్న పంట దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రీసైక్లింగ్ దందా.. కరువు కారణంగా వినియోగానికి ధాన్యం అందుబాటు లో లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు కల్తీ వ్యాపారానికి తెరలేపారు. జిల్లాలో ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుల ద్వారా అందిస్తున్న రేషన్ (దొడ్డు) బియ్యాన్ని కొంత మంది మిల్లర్లు ప్రధాన పట్టణాల్లో ఆధునిక యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేస్తే సన్నబియ్యంగా మార్చుతున్నారు. కొంత మంది మిల్లర్లు రేషన్ డీలర్లను మచ్చిక చేసుకుని లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.1,200 నుంచి 1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ద్వారా తదితర జిమ్మిక్కులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నరకంగా మార్చి రూ.3,800 నుంచి రూ.4,500 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో నెలకు లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు గుర్తు పట్టనంతగా మారుతున్నాయి. క్విం టాలు దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేస్తే 75 నుంచి 80 క్విం టాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు, మిల్లర్లు లక్షల్లో లా భాలు ఘడిస్తున్నారు. ప్రధానంగా ఈ రీసైక్లింగ్ వ్యవహారం బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా సాగుతోంది. నియంత్రణ కరువు.. బియ్యం ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధరలు సమీక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడంతో వ్యాపారుల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులు బియ్యంతోపాటు, నిత్యావసర పప్పులు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. గతేడాది ఇదే సమయంలో ఉన్నతాధికారులు సమీక్షించి ధరల నియంత్రణకు ప్రభుత్వం తరఫున పలు చర్యలు చేపట్టారు. సోనమసూరి బియ్యం రూ.కిలో 27 చొప్పున విక్రయించాలని జిల్లాలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. ప్రస్తుతం ఆ కేంద్రాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం ధరలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు. -
పంటచేలతో మాట్లాడిన శాస్త్రవేత్త
వ్యవసాయ శాస్త్రవేత్తంటే నిత్యం పొలాల్లో ఉండాలి. అప్పుడే మొక్కలతో మాట్లాడటం అలవడుతుంది. అవి తమ సమస్యలను మనకు చెప్పుకోగలుగుతాయి. వాటిని పరిష్కరించే అవకాశం మనకు లభిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన నిజమైన రైతు శాస్త్రవేత్త ఎమ్వీ రెడ్డి సాంబ మసూరి (బీపీటీ 5204) వరి వంగడం గురించి వినని వారు ఉండొచ్చు. కానీ కర్నూలు సన్న బియ్యం అన్నం రుచి ఎరుగని వారుండరు. దేశవ్యాప్తంగా సన్న బియ్యం రకాలు ఎన్నున్నా... కర్నూలు సన్న బియ్యానికి మరేవీ సాటి రావని అనని వారూ ఉండరు. సాంబ మసూరి లేదా బీపీటీ 5204 వరి వంగడం సృష్టి కర్త ప్రొఫెసర్ మమోలవల్లి వెంకట రమణారెడ్డి (85)ఈ నెల 23న బెంగళూరులో కన్ను మూశారు. రైతు లోకానికి ఆయన మరణ వార్త అశనిపాతమనే చెప్పాలి. రెండున్నర దశా బ్దాల క్రితం, 1986లో ఎమ్వీ రెడ్డి రైతు లోకానికి అందించిన సాంబ మసూరి తర్వాత ఎన్ని వందల కొత్త రకాలు వచ్చి నా అవేవీ బీపీటీ 5204కు సాటి రావు. ఉడికిన తర్వాత అన్నం చిట్లకుండా, మెతుకులు పూలలా జాలు వారే సాంబ మసూరి దేశవ్యాప్తంగా వినియోగదారు లకు ప్రీతికరమైనది. రైతుకు అధిక దిగుబడినిచ్చేది. సగటు న ఎకరాకు 40 బస్తాల దిగుబడికి రైతుకు హామీనిచ్చే అది కర్నూలులో పుట్టి, బీపీటీ 5204గా దేశవ్యాప్తంగా విస్తరిం చింది. దేశంలో సాగు చేస్తున్న వరిలో మూడింట ఒక వంతు మన రాష్ట్రంలో రూపొందిన రకాలే. బీపీటీ 5204 వాటిలో ఒకటి. అధిక దిగుబడి, మంచి నాణ్యతలకు పేరు మోసిన సాంబ మసూరి రైతుకు భరోసానిచ్చింది. అంతేకాదు పల్లెల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల గౌరవాన్ని నిలిపింది. కరువు సీమలోని అనంతపూర్ జిల్లా కదిరి దగ్గరి చీకటి వారి పల్లెలో 1929లో ప్రొఫెసర్ రెడ్డి పుట్టారు. 1989లో తిరుపతి ‘ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం’ అసోసియేట్ డెరైక్టర్ ఆఫ్ రిసెర్చ్‌గా పదవీ విరమణ చేశారు. అంతవరకు ఆయన ఎక్కడున్నా కరువు సీమ నేపథ్యాన్ని మరువలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, వంగడాల రూపక ర్తగా ఎమ్వీ రెడ్డి పేరు బీపీటీ 5204 తోనే వినిపిస్తుంది. కానీ నూనె గింజల రకాలపైనే ఆయన ఎక్కువగా కృషి చేశారు. ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ అధిక దిగుబడి వంగడాల ఆవి ష్కరణలో ఆయన కృషి ఉంది. ఆయన సృష్టించిన విత్తనా లతో కంపెనీలు, మిల్లర్లు, వ్యాపారవేత్తలు కోట్లకు పడగలె త్తారు. కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. 1980-83 మధ్య ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆ సమయంలో నేను అక్కడ విద్యార్థిగా ఉన్నాను. రెడ్డి కొంచెం స్థూలకాయులు. అయినా చక చకా నడుస్తూ, పరిసరాలను నిశితంగా గమనించేవారు. తరగతి గదుల్లో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సంభాషణలను, సమన్వయాన్ని ఆరాతీస్తూ కళాశాలను సజీవంగా నడిపిన అసమాన పరిపాలనా దక్షుడు. మొదటి సంవత్సరం విద్యా ర్థులకు, వారి తల్లిదండ్రులకు వ్యసాయంలోని సాధక బాధ కాలను క్లుప్తంగా ఆయన వివరించే తీరు ఆకట్టుకునేది. చివ రి ఏడాది మొదటి ఆరు నెలలు గ్రామాల్లో ఉండాలి. ఆ సంద ర్భంగా ఆయన ఇచ్చే మార్గదర్శకత్వం ఆలోచింపజేసేదిగా ఉండేది. విద్యార్థులు పెడదోవ పట్టకుండా నైతిక వర్తన, నియమనిబంధనలను గురించి పదే పదే హెచ్చరించేవారు. వ్యవసాయ శాస్త్రవేత్తంటే నిత్యం పొలాల్లో ఉండాలి. అ ప్పుడే మొక్కలతో మాట్లాడటం అలవడుతుంది. అవి తమ సమస్యలను మనకు చెప్పుకోగలుగుతాయి. వాటిని పరిష్క రించే అవకాశం మనకు లభిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సారు ఎమ్వీ రెడ్డి. మొక్కలతో ఎంత ఎక్కువగా మమేకం కాగలిగితే అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుం దని నిత్యం తన సహచరులకు, శిష్యులకు బోధించేవారు. తానే ఒక ఉదాహరణగా నిలిచేవారు. నాడు వ్యవసాయ పరిశోధనలు పొలంలో సాగాయి. నేడవి గట్టెక్కి, ‘కట్ అండ్ పేస్ట్’ పద్ధతిలో కంప్యూటర్, ఇంటర్నెట్ సాంకేతికతపైనే ఆధారపడి సాగుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి. అందుకేనేమో రెండున్నర దశాబ్దాల క్రితం నాటి బీపీటీ 5204 ఇంకా రాజ్యమేలుతోంది. తెలుగు నేలపై వరి సాగు సాగినంత కాలం బీపీటీ 5204 ఉంటుంది. బీపీటీ వరి కంకి కంకిలో, గింజ గింజలో ఎమ్వీ రెడ్డి సజీవంగా ఉంటారు. మనం తినే ప్రతి అన్నం ముద్ద ఆయన జీవన సాఫల్యతకు సాక్ష్యమై నిలుస్తుంది. మరో నాలుగు బీపీటీ 5204లనైనా ఆవిష్కరించడమే ఆ రైతు శాస్త్రవేత్తకు నిజమైన నివాళి. వలేటి గోపీచంద్ (వ్యాసకర్త ‘ఆకాశవాణి’ హైదరాబాద్ కేంద్రం, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్)