పంటచేలతో మాట్లాడిన శాస్త్రవేత్త | agriculture scientist M.V. Reddy | Sakshi
Sakshi News home page

పంటచేలతో మాట్లాడిన శాస్త్రవేత్త

Published Sun, Apr 27 2014 12:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

సాంబ మసూరి వరి (ఇన్ సెట్లో ప్రొఫెసర్ ఎమ్ వీ రెడ్డి) - Sakshi

సాంబ మసూరి వరి (ఇన్ సెట్లో ప్రొఫెసర్ ఎమ్ వీ రెడ్డి)

వ్యవసాయ శాస్త్రవేత్తంటే నిత్యం పొలాల్లో ఉండాలి. అప్పుడే మొక్కలతో మాట్లాడటం అలవడుతుంది. అవి తమ సమస్యలను మనకు చెప్పుకోగలుగుతాయి. వాటిని పరిష్కరించే అవకాశం మనకు లభిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన నిజమైన రైతు శాస్త్రవేత్త ఎమ్‌వీ రెడ్డి
 
 సాంబ మసూరి (బీపీటీ 5204) వరి వంగడం గురించి వినని వారు ఉండొచ్చు. కానీ కర్నూలు సన్న బియ్యం అన్నం రుచి ఎరుగని వారుండరు. దేశవ్యాప్తంగా సన్న బియ్యం రకాలు ఎన్నున్నా... కర్నూలు సన్న బియ్యానికి మరేవీ సాటి రావని అనని వారూ ఉండరు. సాంబ మసూరి లేదా బీపీటీ 5204 వరి వంగడం సృష్టి కర్త ప్రొఫెసర్ మమోలవల్లి వెంకట రమణారెడ్డి (85)ఈ నెల 23న బెంగళూరులో కన్ను మూశారు. రైతు లోకానికి ఆయన మరణ వార్త అశనిపాతమనే చెప్పాలి. రెండున్నర దశా బ్దాల క్రితం, 1986లో ఎమ్‌వీ రెడ్డి రైతు లోకానికి అందించిన సాంబ మసూరి తర్వాత ఎన్ని వందల కొత్త రకాలు వచ్చి నా అవేవీ బీపీటీ 5204కు సాటి రావు. ఉడికిన తర్వాత అన్నం చిట్లకుండా, మెతుకులు పూలలా జాలు వారే సాంబ మసూరి దేశవ్యాప్తంగా వినియోగదారు లకు ప్రీతికరమైనది. రైతుకు అధిక దిగుబడినిచ్చేది.  సగటు న ఎకరాకు 40 బస్తాల దిగుబడికి రైతుకు హామీనిచ్చే అది కర్నూలులో పుట్టి, బీపీటీ 5204గా దేశవ్యాప్తంగా విస్తరిం చింది. దేశంలో సాగు చేస్తున్న వరిలో మూడింట ఒక వంతు మన రాష్ట్రంలో రూపొందిన రకాలే. బీపీటీ 5204 వాటిలో ఒకటి. అధిక దిగుబడి, మంచి నాణ్యతలకు పేరు మోసిన సాంబ మసూరి రైతుకు భరోసానిచ్చింది. అంతేకాదు పల్లెల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల గౌరవాన్ని నిలిపింది.  

 కరువు సీమలోని అనంతపూర్ జిల్లా కదిరి దగ్గరి చీకటి వారి పల్లెలో 1929లో ప్రొఫెసర్ రెడ్డి పుట్టారు. 1989లో తిరుపతి ‘ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం’  అసోసియేట్ డెరైక్టర్ ఆఫ్ రిసెర్చ్‌గా పదవీ విరమణ చేశారు.  అంతవరకు ఆయన ఎక్కడున్నా కరువు సీమ నేపథ్యాన్ని మరువలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, వంగడాల రూపక ర్తగా ఎమ్‌వీ రెడ్డి పేరు బీపీటీ 5204 తోనే వినిపిస్తుంది. కానీ నూనె గింజల రకాలపైనే ఆయన ఎక్కువగా కృషి చేశారు. ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ అధిక దిగుబడి వంగడాల ఆవి ష్కరణలో ఆయన కృషి ఉంది. ఆయన సృష్టించిన విత్తనా లతో కంపెనీలు, మిల్లర్లు, వ్యాపారవేత్తలు కోట్లకు పడగలె త్తారు. కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. 1980-83 మధ్య ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆ సమయంలో నేను అక్కడ విద్యార్థిగా ఉన్నాను. రెడ్డి కొంచెం స్థూలకాయులు. అయినా చక చకా నడుస్తూ, పరిసరాలను నిశితంగా గమనించేవారు. తరగతి గదుల్లో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సంభాషణలను, సమన్వయాన్ని ఆరాతీస్తూ కళాశాలను సజీవంగా నడిపిన అసమాన పరిపాలనా దక్షుడు. మొదటి సంవత్సరం విద్యా ర్థులకు, వారి తల్లిదండ్రులకు వ్యసాయంలోని సాధక బాధ కాలను క్లుప్తంగా ఆయన వివరించే తీరు ఆకట్టుకునేది. చివ రి ఏడాది మొదటి ఆరు నెలలు గ్రామాల్లో ఉండాలి. ఆ సంద ర్భంగా ఆయన ఇచ్చే మార్గదర్శకత్వం ఆలోచింపజేసేదిగా ఉండేది. విద్యార్థులు పెడదోవ పట్టకుండా నైతిక వర్తన, నియమనిబంధనలను గురించి పదే పదే హెచ్చరించేవారు.  

 వ్యవసాయ శాస్త్రవేత్తంటే నిత్యం పొలాల్లో ఉండాలి. అ ప్పుడే మొక్కలతో మాట్లాడటం అలవడుతుంది. అవి తమ సమస్యలను మనకు చెప్పుకోగలుగుతాయి. వాటిని పరిష్క రించే అవకాశం మనకు లభిస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సారు ఎమ్‌వీ రెడ్డి. మొక్కలతో ఎంత ఎక్కువగా మమేకం కాగలిగితే అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుం దని నిత్యం తన సహచరులకు, శిష్యులకు బోధించేవారు. తానే ఒక ఉదాహరణగా నిలిచేవారు. నాడు వ్యవసాయ పరిశోధనలు పొలంలో సాగాయి. నేడవి గట్టెక్కి, ‘కట్ అండ్ పేస్ట్’ పద్ధతిలో కంప్యూటర్, ఇంటర్‌నెట్ సాంకేతికతపైనే ఆధారపడి సాగుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి. అందుకేనేమో రెండున్నర దశాబ్దాల క్రితం నాటి బీపీటీ 5204 ఇంకా రాజ్యమేలుతోంది. తెలుగు నేలపై వరి సాగు సాగినంత కాలం బీపీటీ 5204 ఉంటుంది. బీపీటీ వరి కంకి కంకిలో, గింజ గింజలో ఎమ్‌వీ రెడ్డి సజీవంగా ఉంటారు. మనం తినే ప్రతి అన్నం ముద్ద ఆయన జీవన సాఫల్యతకు సాక్ష్యమై నిలుస్తుంది. మరో నాలుగు బీపీటీ 5204లనైనా ఆవిష్కరించడమే ఆ రైతు శాస్త్రవేత్తకు నిజమైన నివాళి.    

వలేటి గోపీచంద్ (వ్యాసకర్త ‘ఆకాశవాణి’  హైదరాబాద్ కేంద్రం, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement