వందేమాతరమే నిజమైన జాతీయ గీతం: ఆర్ఎస్ఎస్
ముంబై: రాజ్యాంగం గుర్తించిన ‘జనగణ మన’ గీతం కంటే వందేమాతరం గీతమే నిజమైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజి జోషి వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘జనగణమన’ను గౌరవించాల్సిందేనని, అయితే, నిజమైన అర్థంలో వందేమాతరమే జాతీయ గీతమని ఎవరైనా ఒప్పుకుంటారన్నారు.
వందేమాతరం గీతం జాతి వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుందన్నారు. రెండు గీతాలూ గౌరవప్రదమైనవేనని ముక్తాయించారు. అలాగే, భారతీయులు తరతరాలుగా కాషాయ జెండాను భారతీయ సంస్కృతికి ప్రతీకగా గౌరవిస్తూ, అభిమానిస్తున్నారని, అదే సమయంలో మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా 1947లో రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిందని, అందువల్ల ఆ రెండు జండాలనూ గౌరవించాలన్నారు.