ముంపు ప్రాంతాలపై పాట రాస్తా
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
వీఆర్‌పురం (రంపచోడవరం) : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మూలంగా సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుల ఆవేదనను కళ్లకు కట్టే రీతిలో ఒక పాట రాస్తానని సినీ గేయ రచయితీ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి 15వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల ముంగిపు కార్యక్రమానికి వచ్చిన ఆయన.. బుధవారం పాపికొండల ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చారు. మండలంలోని పోచవరం బోట్ పాయింట్ నుంచి గోదావరిపై బోట్లో పేరంటపల్లిలోని శివాలయం, పాపికొండలను వీక్షించారు.
ప్రకృతి అందాలు కనుమరుగైతే బాధ వేస్తుంది..
పచ్చటి అటవీ ప్రాంతం, ఆహ్లాదకర వాతావరణం, గోదావరి నది వంపు సొంపుల నడుమ ఉన్న గిరిజన పల్లెలు.. గోదావరి ఒడిలో కలిసిపోతాయంటే బాధ వేస్తుందని అశోక్‌తేజ అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను వదిలి మరో ప్రాంతంలో వీరు బతకాలంటే కష్టమేనన్నారు.
అసలు ఇంటి పేరు గుర్రం ..
సుద్దాల అశోక్ తేజాగా సుప్రసిద్ధుడైన ఆయన ఇంటి పేరు గుర్రం అని చెప్పారు. నల్గొండ జిల్లా గుండాల మండలంలోని సుద్దాల గ్రామం ఆయన స్వగ్రామం. తండ్రి హనుమంతు కూడా సినీగేయ రచయితే. ఆయనను సుద్దాల హనుమంతుగా పిలిచేవారు. దీంతో ఇంటి పేరు సుద్దాలగా మారిందని ఆయన అన్నారు. గేయ రచీతగా 22 ఏళ్ల కాలంలో 1,250 సినిమాల్లో సుమారు 2,200 పైగా పాటలు రాసినట్టు చెప్పారు. పాండురంగడు చిత్రంలో రాసిన ‘మాతృదేవోభవ’ పాట అంటే తనకు ఇష్టమని చెప్పారు.