అమెరికాలో మరో దారుణం
► మహిళను బ్యాంకు నుంచి గెంటేసిన అధికారులు
వాషింగ్టన్: అమెరికాలో మరో జాతి వివక్ష సంఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిందని ఓ మహిళను బయటకు గెంటేశారు క్రెడిట్ యూనియన్ బ్యాంకు అధికారులు. ఉన్నపలంగా బురఖా తొలగించకపోతే పోలీసులను పిలుస్తామంటూ బెదిరించారు. వివారాల్లోకి వెళితే జమీలా మహమ్మద్ అనే మహిళ శుక్రవారం తన కారు బిల్లు కట్టేందుకు వాషింగ్టన్‌లోని సౌండ్ క్రెడిట్ యూనియన్ బ్యాంకుకు వెళ్లింది. అయితే, తమ బ్యాంకులోకి బురఖా, టోపీలు, సన్గ్లాసెస్లకు అనుమతి లేదంటూ బ్యాంకు అధికారులు అడ్డు చెప్పారు.
అయితే, బేస్ బాల్ ప్లేయింగ్ టోపిలు ధరించిన ఇద్దరికి మాత్రం ఆమె కళ్ల ముందే ఎలాంటి అభ్యంతరం లేకుండా సహకరించారు. బ్యాంకు సూపర్ వైజర్ నేరుగా ఆమె దగ్గరికొచ్చి మూడు అంకెలు లెక్కబెట్టేలోగా బురఖాను తొలిగించాలని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరిస్తూ సెల్ ఫోన్‌తో వీడియో కూడా తీశాడు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనైంది. ఫేస్బుక్లో తాను ఎదుర్కొన్న జాతి వివక్షను పంచుకుంది. తనలాంటి పరిస్థితి మరొకరికి ఎదురవ్వకూడదని ఆకాంక్షించింది. కాగా, దీనిపై సదరు బ్యాంకు స్పందిస్తూ జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పింది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.