south africa doctors
-
మరణమా?.. హెచ్ఐవీతోనా?
జోహన్నెస్‌బర్గ్: ఓ వైపు ప్రాణాలు నిలబెట్టాలి.. మరో వైపు హెచ్ఐవీ సోకే ముప్పు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హెచ్ఐవీ సోకిన తల్లి కాలేయాన్ని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బిడ్డకి మార్పిడిచేసి దక్షిణాఫ్రికా వైద్యులు విజయం సాధించారు. ‘చావా? హెచ్ఐవీతోనే ఎల్లకాలం జీవించడమా? అన్న సందిగ్ధంలో వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైద్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ శస్త్రచికిత్స నుంచి తల్లీబిడ్డలు కోలుకున్నారు. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. తల్లి నుంచి హెచ్ఐవీ ఆమె బిడ్డకు సోకిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఆ వైరస్ లేని మరో వ్యక్తికి కాలేయాన్ని మార్పిడి చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే దాతల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్స్ డొనాల్డ్ గోర్డాన్ మెడికల్ సెంటర్ వైద్యులు ‘ఎయిడ్స్’ అనే జర్నల్‌లో గురువారం రాసిన వ్యాసంలో ఈ వివరాలున్నాయి. కాలేయ మార్పిడికి ముందు చిన్నారికి అందించిన ఔషధాలు.. ఆమెకు ఎయిడ్స్ సోకే ముప్పును నివారించి ఉండొచ్చని, అయినా కొంత కాలం గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బిడ్డకు తల్లి నుంచి హెచ్ఐవీ సోకే ముప్పు ఉందని భావించడంతో, కాలేయాన్ని మార్పిడి చేయడంపై ఎంతో మథనపడ్డామని పేర్కొన్నారు. సంక్రమిక వ్యాధుల నివారణ నిపుణులతో వరుస పరీక్షలు చేయించగా బిడ్డకు వైరస్ సోకినట్లు తేలలేదని తెలిపారు. ఒకవేళ ఆ చిన్నారి హెచ్ఐవీ బారిన పడినా కూడా..విస్తృ్తతంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఔషధాల సాయంతో సాధారణ జీవితం గడిపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
కోల్పోయిన మగతనాన్ని ప్రసాదించారు..
వైద్య చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు సౌతాఫ్రికా వైద్యులు. మొట్టమొదటిసారి పురుషాంగం ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. ఏడు గంటపాటు నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్ ద్వారా అంగాన్ని కోల్పోయిన 21 ఏళ్ల యువకుడికి తిరిగి దానిని ప్రసాదించగలిగారు. యూనివర్సిటీ ఆఫ్ స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్ల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కేప్‌టౌన్‌లోని టైగర్బర్గ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం మీడియాకు తెలిపారు. మత మార్పిడిలో భాగంగా సున్తీ చేయించుకున్న ఓ యువకుడు (పేరు చెప్పలేదు) కొద్ది రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సున్తీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని పురుషాంగాన్ని తొలిగించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత కేప్‌టౌన్ వైద్యుల ప్రకటన ఆ యువకుడికి కొత్త ఆశలు రేకెత్తించింది.. అనారోగ్యంతో మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అతని అంగాన్ని సదరు యువకుడికి అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఏ తేదీన ఆపరేషన్ నిర్వహించిందీ వెల్లడించనప్పటికీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని టైగర్స్ బర్గ్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు ఆండ్రూ వాన్‌డెర్ మెర్వే చెప్పారు. సున్తీ సమయంలో అజాగ్రత్తల కారణంగా ఆఫ్రికాలో ఏటా వందలమంది యువకులు అంగాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు.