సమంత ఇంట్లో సంతోషం చేరింది
– నాగచైతన్య
‘తెలుగు చిత్రసీమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, రామానాయుడు వంటి దిగ్గజాలు చేసిన కృషి మరువలేనిది. అప్పట్నుంచి చిత్రసీమ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది.
ఇక, అవార్డుల విషయానికి వస్తే విలేకరి స్థాయి నుంచి పత్రికాధినేతగా ఎదిగి, 15 ఏళ్లుగా అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహిస్తున్న ‘సంతోషం’ సురేశ్ కొండేటి ఎంతగా కష్టపడ్డాడో అర్థమవుతోంది’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లో ‘సంతోషం’ సౌతిండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక జరిగింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ప్రేమమ్), నటిగా సమంత (అఆ), దర్శకుడిగా బోయపాటి శ్రీను (సరైనోడు), నిర్మాతగా రాజ్ కందుకూరి (పెళ్లి చూపులు) అవార్డులు అందుకున్నారు. స్వర్గీయ దాసరి నారాయణరావు పేరు మీద ఈ ఏడాది నుంచి దాసరి స్మారక అవార్డులనూ ‘సంతోషం’ సురేశ్ ఇవ్వడం ప్రారంభించారు.
నిర్మాతగా అల్లు అరవింద్, నటుడిగా మురళీమోహన్, రచయితలుగా పరుచూరి సోదరులు, విలేకరిగా పసుపులేటి రామారావులు దాసరి స్మారక పురస్కారాన్ని, అల్లు రామలింగయ్య స్మారక అవార్డును సప్తగిరి అందుకున్నారు. నటి రోజా రమణి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ‘‘ప్రేక్షకులు, విమర్శకుల ప్రోత్సాహంతో ‘ప్రేమమ్’కు అవార్డు వచ్చింది. అలాగే, సమంత ఇంటినిండా ఉన్న అవార్డుల్లో సంతోషం అవార్డు కూడా చేరింది’’ అన్నారు నాగచైతన్య. ‘‘దాసరిగారి పేరు మీద తొలిసారిగా సురేశ్ అవార్డు నెలకొల్పడం, అదీ నేను అందుకోవడం సంతోషం’’ అన్నారు అల్లు అరవింద్. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.