soya rate
-
మధ్యాహ్నానికే తగ్గిన ధర
భైంసా, న్యూస్‌లైన్ : పంట పండించేందుకు ప్రకృతి దోబూచులాటలో.. అమ్మే క్ర మంలో వ్యాపారుల చేతిలో రైతులు కుదేలవుతున్నారు. ఏటా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారుల ‘మద్దతు’ లభించక సహనం కోల్పోతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు ధర కోసం ఎదురుచూసినా ఫలితం లేక అమ్ముకునేందుకు సిద్ధపడ్డ తరుణంలోనూ వారిని కష్టాలు వెంటాడుతున్నాయి. శనివారం భైంసా మార్కెట్‌కు ఈ ప్రాంతంలోని సుమారు 140 మంది రైతులు సోయాను విక్రయించేందుకు తీసుకొచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోయా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో మార్కెట్లో సోయా కుప్పలు కనిపించాయి. గాంధీగంజ్‌లో ఒకేసారి సోయా కుప్పలు కనిపించడంతో వ్యాపారులు ధర తగ్గించారు. రైతుల ఆగ్రహం... శనివారం ఉదయం నుంచి క్వింటాలు సోయాకు రూ.2150 నుంచి రూ. 3170 వరకు ప్రైవేటు వ్యాపారులు ధర చెల్లించారు. మధ్యాహ్నం నుంచి ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. క్వింటాలు సోయాకు రూ.2400 లోపే ధర నిర్ణయించారు. దీంతో పంట ఇచ్చేందుకు రైతులు ముందుకురాలేదు. ఏఎంసీ కార్యాలయానికి వెళ్లారు. తక్కువ ధర ఇస్తున్నారంటూ ఏఎంసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో గంటపాటు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మ న్ విఠల్‌రెడ్డి ఫోన్లో అధికారులతో మాట్లాడారు. వ్యాపారులతో చర్చిం చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఏఎంసీ సిబ్బందిని ఆదేశించారు. రాత్రికి కొనుగోళ్లు జరపాలని వ్యాపారులకు సూచించారు. మిగిలిన నిల్వలను ఆదివారం సెలవయినా కొనుగోలు చేయాలని సూ చించారు. దీంతో రైతులు శాంతించారు. మద్దతు ధర ఇవ్వకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. భారీగా వస్తున్న సోయా... గత నాలుగు, ఐదు రోజులుగా వర్షం కురువడం లేదు. ఎండలు కా స్తుండడంతో రైతులంతా కుప్పలుగా కోసిన సోయాను మిల్లర్లతో ప ట్టించి గ్రామాల్లో కళ్లాలపై వేశారు. ప్రస్తుతం మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ధర పెరుగుతుందని ఆశించిన రైతులు ముందుగా సోయా కోసి ఇళ్లలోనే నిల్వలు చేశారు. చివరి వరకు ధర రాకపోవడంతో చేసేదేం లేక నిల్వలను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో తేమశా తం అంతగా లేకపోయినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని సో యారైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సోయారైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. రాత్రి 8 గంటల నుంచి వ్యాపారులు కొనుగోళ్లు పునఃప్రారంభించారు. రాత్రిపూట సోయా కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. -
సోయా వచ్చె.. ఆనందం తెచ్చె..
మోర్తాడ్, న్యూస్‌లైన్ : సోయా ధర రైతుల్లో ఆనందం నింపుతోంది. సీజన్ ఆరంభంలోనే క్వింటాలుకు *3,200 దాటింది. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సోయా పంటకు మంచి ధర లభిస్తోంది. గతేడాది క్వింటాలుకు * 2,600 ఉన్న ధరను ప్రభుత్వం * 2,900లకు పెంచింది. ఇప్పుడిప్పుడే పంట మార్కెట్‌కు తరలుతోంది. అయితే మార్కెట్లో * 3,200లకుపైనే ధర లభిస్తోంది. కాగా గతేడాది సీజన్లో క్వింటాలుకు * 2,800 మాత్రమే ధర లభించింది. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం * 4 వేలకు చేరింది. దీంతో పంట నిల్వ చేసుకున్నవారు, వ్యాపారులు లబ్ధిపొందారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 40 వేల హెక్టార్లలో సోయా పంట సాగయ్యింది. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడానికి విత్తనాలకు సబ్సిడీపై అందించింది. అయితే గతంలో సబ్సిడీని రైతులకు నేరుగా అందించేవారు. ఈసారి సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. సబ్సిడీ విత్తనాలు సరిపోకపోతే మార్కెట్లో కొనుగోలు చేసి మరీ సోయా పంట వేశారు. ఇక్కడ పండించిన సోయా విత్తనాలు ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని సోయా ఆయిల్ మిల్లులకు తరలుతాయి. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరిగినా డిమాండ్ ఉండడంతో ధర ఆశాజనకంగా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ఎక్కువగా మార్కెట్లో ధర లభిస్తోంది. అయితే మార్కెట్లోకి ఒకేసారి పెద్ద మొత్తంలో సోయా పంట తరలివచ్చినప్పుడు కూడా ధర నిలకడగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారితే ధర తగ్గి తమకు లాభం లేకుండా పోతుందని వారు పేర్కొంటున్నారు.