మోర్తాడ్, న్యూస్‌లైన్ :
సోయా ధర రైతుల్లో ఆనందం నింపుతోంది. సీజన్ ఆరంభంలోనే క్వింటాలుకు *3,200 దాటింది. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో సోయా పంటకు మంచి ధర లభిస్తోంది. గతేడాది క్వింటాలుకు * 2,600 ఉన్న ధరను ప్రభుత్వం * 2,900లకు పెంచింది. ఇప్పుడిప్పుడే పంట మార్కెట్‌కు తరలుతోంది. అయితే మార్కెట్‌లో * 3,200లకుపైనే ధర లభిస్తోంది. కాగా గతేడాది సీజన్‌లో క్వింటాలుకు * 2,800 మాత్రమే ధర లభించింది. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం * 4 వేలకు చేరింది. దీంతో పంట నిల్వ చేసుకున్నవారు, వ్యాపారులు లబ్ధిపొందారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 40 వేల హెక్టార్లలో సోయా పంట సాగయ్యింది. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడానికి విత్తనాలకు సబ్సిడీపై అందించింది. అయితే గతంలో సబ్సిడీని రైతులకు నేరుగా అందించేవారు. ఈసారి సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
సబ్సిడీ విత్తనాలు సరిపోకపోతే మార్కెట్‌లో కొనుగోలు చేసి మరీ సోయా పంట వేశారు. ఇక్కడ పండించిన సోయా విత్తనాలు ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని సోయా ఆయిల్ మిల్లులకు తరలుతాయి. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరిగినా డిమాండ్ ఉండడంతో ధర ఆశాజనకంగా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ఎక్కువగా మార్కెట్‌లో ధర లభిస్తోంది. అయితే మార్కెట్‌లోకి ఒకేసారి పెద్ద మొత్తంలో సోయా పంట తరలివచ్చినప్పుడు కూడా ధర నిలకడగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారితే ధర తగ్గి తమకు లాభం లేకుండా పోతుందని వారు పేర్కొంటున్నారు.
సోయా వచ్చె.. ఆనందం తెచ్చె..
Published Mon, Sep 23 2013 3:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement