SP rajeskumar
-
త్వరలో గుంటూరులో ప్రి లిటిగేషన్ సెంటర్
అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ నూతన రాజధాని ఏర్పాటు క్రమంలో నేరాల అదుపునకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. ఇటీవల జిల్లాలో భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వాటి పరిష్కారానికి త్వరలో రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రార్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులతో కూడిన ప్రి లిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అర్బన్ జిల్లా పరిధిలో చేపడుతున్న మార్పులు, ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు, కేసుల దర్యాప్తు వివరాలు.. తదితర అంశాల గురించి వివరించారు. - గుంటూరు క్రైం ప్రభుత్వానికి ప్రతిపాదనలు రాజధాని ఏర్పాటు కారణంగా జనాభా రద్దీతోపాటు వీఐపీల భద్రత, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లు అన్నింటినీ అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపాం. నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నూతనంగా నాలుగు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, శాంతి భద్రతల పరిరక్షణకు మరో మూడు పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. జనవరి 26 నుంచి స్పెషల్ వెబ్సైట్ పోలీసు సేవలను సులభతరం చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పోలీస్స్టేషన్లలో బాధితులు, సాక్షులకు ఎఫ్ఐఆర్ కాపీ వాంగ్మూలం, డ్రాఫ్ట్ చార్జిషీట్లను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీటన్నింటినీ జనవరి 26 నుంచి ‘ఎస్పీఎస్ గుంటూరు అర్బన్’ అనే వెబ్సైట్లో ఉంచి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అన్ని వివరాలు పొందే వెసులుబాటు కల్పిస్తాం. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. ఆ రోజున పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొంటారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచిలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావుతో రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణతో కలిసి శుక్రవారం సమావేశమై సమీక్ష జరిపామన్నారు. జిల్లా అధికారులతో సోమవారం సమావేశమై బందోబస్తుకు సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చిస్తామని వివరించారు. నేరాలకు పాల్పడితే రౌడీషీట్లే.. భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రి లిటిగేషన్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నాం. ఒకే స్థలాన్ని ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు చేయడం, ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకే స్థలాన్ని విక్రయించడం వంటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం. భూములు, స్థలాలను ఆక్రమించడం, మధ్యవర్తులుగా ఉండి మోసం చేయడం చేస్తే సస్పెక్టెడ్, రౌడీషీట్లు తెరుస్తాం. వీటిని వైట్ కాలర్ నేరాలుగా పరిగణిస్తాం. కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అర్బన్ జిల్లాకు కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు మూడు అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. శిక్షణలో నేర్చుకున్న అంశాలతోపాటు పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించే సందర్భాల్లో తీసుకోవాల్సిన మెలకువలు, సమయస్ఫూర్తిగా వ్యవహరించడాన్ని తెలియజేస్తాం. భూ వివాదంపై చర్యలు.. గుంటూరు శ్యామలానగర్‌లోని సౌజన్యకుమార్‌కు చెందిన భూవివాదంలో అధికారుల పనితీరు తదితర అంశాలపై దర్యాప్తు వేగవంతం చేశాం. కొందరు పోలీస్ అధికారులు, న్యాయవాదుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా ఇప్పటికే గుర్తించాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదుచేస్తాం. -
బాలల హక్కుల చట్టాలపై పట్టు సాధించాలి
గుంటూరు క్రైం: బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, గుడ్ షఫర్డ్ కాన్వెంట్ అమరావతి ఆధ్వర్యంలో బుధవారం ‘పోలీసు భద్రత-మానవ హక్కుల పరిరక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ ఎఫెన్సెస్ ఆఫ్ చిల్డ్రన్ (పోక్సో), నిర్భయ చట్టాల్లోని పలు సెక్షన్లపై వివరించారు. ముఖ్యఅతిథి రాజేష్‌కుమార్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే బాధితులకు నిజమైన న్యాయం చేయగలమన్నారు. బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలలపై అత్యాచారం జరిగిన సందర్భాల్లో పోక్సో, నిర్భయ చట్టాల ప్రకారం కేసులు పటిష్టంగా నమోదు చేయాలన్నారు. మహిళలపై హింసాత్మక చర్యలకు పాల్పడినవారిపైనా కఠినంగా వ్యవహరించి చట్టంలో ఉన్న సెక్షన్లను పటిష్టంగా నమోదుచేసి బాధితులకు న్యాయంచేయాలని సూచించారు. బాలలు, వారి హక్కులను కాపాడడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పారు. గుడ్ షఫర్డ్ కాన్వెంట్ సిస్టర్ అరుణాజార్జి మాట్లాడుతూ బాలలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం 73 దేశాల్లో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. సమాజంలో బాలలు అనేక రకాల హింసలకు గురవుతుండడం విచారకరమన్నారు. పాశ్చాత్య సంస్కృతి పేరుతో విష సంస్కృతికి కొందరు అలవాటుపడి బాలలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతుండడం విచాకరమన్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ రోషన్‌కుమార్ మాట్లాడుతూ పోక్సో, నిర్భయ చట్టాలపై పోలీసులు పూర్తిస్థాయిలో తెలుసుకుంటే బాధితులకు న్యాయంచేయవచ్చని వారిని చైతన్య పరిచేందుకు సదస్సునిర్వహించామని చెప్పారు. అనంతరం పలువురు సిబ్బంది చట్టాల్లో తమకు ఉన్న అనుమానాలపై వివరాలు తెలసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు, సిస్టర్లు దీప్తి, గ్రేసి, అరుల్దాస్, కోలా సమీర్, డీఎస్పీలు గంగాధరం, నరసింహ, మధుసూదనరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసులపై సత్వర దర్యాప్తు
గుంటూరు క్రైం: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తిచేసి నిందితులను కోర్టులో హాజరు పరచాలని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ డీఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిధిలోని డీఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్యాప్తులో ఫిర్యాదు అవాస్తవమని తేలితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తనకు అందజేయాలని చెప్పారు. నేరాల నియంత్రణకు అవసరమైన అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజధాని ఏర్పాటు క్రమంలో జిల్లాలోని భూములు, స్థలాల ధరలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో స్థలాల ఆక్రమణలకు, దాడులకు పాల్పడుతున్న వ్యక్తులపై నిర్ధాక్షిణ్యంగా కేసులు నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు వచ్చినపుడు కేసులు నమోదు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘాను కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేలా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని చెప్పారు. రౌడీషీటర్ల వివరాలను తెలియచేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో హత్యలు, హత్యాయత్నాలు, అల్లర్లు, దొమ్మీలకు పాల్పడినవారిపై సస్పెక్టెడ్ రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీలు జె.భాస్కరరావు, బి.శ్రీనివాసరావు, డీఎస్పీలు డి.గంగాధరం, ఎం.మధుసూదనరావు, కె.నరసింహ, బి.పి.తిరుపాల్, ఎస్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మహిళలకు అండగా ఉంటాం.. ఆపదలో ఉన్న మహిళలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసిన మహిళలు.. స్త్రీశిశు సంక్షేమశాఖ ద్వారా పునరావాసం, లబ్ధి పొందిన మహిళలతో ఎస్పీ శుక్రవారం సమావేశమయ్యారు. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం భర్తతో కలసి కాపురం చేసుకుంటున్నామని కొందరు, భర్తల వేధింపులు భరించలేక పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నామని మరికొందరు ఎస్పీకి వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. కౌన్సెలింగ్ సెంటర్లో రిటైర్డ్ ఉద్యోగులు సేవాభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు జె.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసులు, స్త్రీశిశు సంక్షేమ శాఖాధికారులు ఎన్.సంగీత, వి.పద్మ, రిటైర్డ్ ఏఎస్పీలు రహమాన్, రవీంద్రనాధ్ ఠాగూర్, పీపీ టి. వెంకటేశ్వరరావు, మానసిక వైద్యులు వై.సంజయ్, ఏ.సీతామహాలక్ష్మీ, సుజాత, బి.హనుమంతరావు, సీఐ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.