బాలల హక్కుల చట్టాలపై పట్టు సాధించాలి
గుంటూరు క్రైం: బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, గుడ్ షఫర్డ్ కాన్వెంట్ అమరావతి ఆధ్వర్యంలో బుధవారం ‘పోలీసు భద్రత-మానవ హక్కుల పరిరక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు.
ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ ఎఫెన్‌సెస్ ఆఫ్ చిల్డ్రన్ (పోక్సో), నిర్భయ చట్టాల్లోని పలు సెక్షన్‌లపై వివరించారు. ముఖ్యఅతిథి రాజేష్‌కుమార్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే బాధితులకు నిజమైన న్యాయం చేయగలమన్నారు. బాలలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాలలపై అత్యాచారం జరిగిన సందర్భాల్లో పోక్సో, నిర్భయ చట్టాల ప్రకారం కేసులు పటిష్టంగా నమోదు చేయాలన్నారు. మహిళలపై హింసాత్మక చర్యలకు పాల్పడినవారిపైనా కఠినంగా వ్యవహరించి చట్టంలో ఉన్న సెక్షన్‌లను పటిష్టంగా నమోదుచేసి బాధితులకు న్యాయంచేయాలని సూచించారు. బాలలు, వారి హక్కులను కాపాడడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పారు.
గుడ్ షఫర్డ్ కాన్వెంట్ సిస్టర్ అరుణాజార్జి మాట్లాడుతూ బాలలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం 73 దేశాల్లో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. సమాజంలో బాలలు అనేక రకాల హింసలకు గురవుతుండడం విచారకరమన్నారు. పాశ్చాత్య సంస్కృతి పేరుతో విష సంస్కృతికి కొందరు అలవాటుపడి బాలలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతుండడం విచాకరమన్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ రోషన్‌కుమార్ మాట్లాడుతూ పోక్సో, నిర్భయ చట్టాలపై పోలీసులు పూర్తిస్థాయిలో తెలుసుకుంటే బాధితులకు న్యాయంచేయవచ్చని వారిని చైతన్య పరిచేందుకు సదస్సునిర్వహించామని చెప్పారు. అనంతరం పలువురు సిబ్బంది చట్టాల్లో తమకు ఉన్న అనుమానాలపై వివరాలు తెలసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు, సిస్టర్లు దీప్తి, గ్రేసి, అరుల్‌దాస్, కోలా సమీర్, డీఎస్పీలు గంగాధరం, నరసింహ, మధుసూదనరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.