సల్వీందర్ ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ/అమృతసర్: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి సందర్భంగా అనుమానాస్పదంగా వ్యవహరించిన పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇల్లు, ఆఫీసు సహా ఆరు ప్రాంతాల్లో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. అమృత్సర్, గుర్దాస్‌పూర్‌లలోని ఎస్పీ గృహాలు, ఆఫీసులతో పాటు సల్వీందర్ మిత్రుడు, నగల వర్తకుడు రాజేశ్ వర్మ, సల్వీందర్ వంటవాడు మదన్‌గోపాల్‌ల ఇళ్లను సోదా చేశారు. అలాగే, సల్వీందర్, రాజేశ్ వర్మల స్నేహితురాలైన ఓ మహిళ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కొన్ని రోజులుగా సల్వీందర్‌ను ఎన్ఐఏ విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఆయనపై బుధవారం సత్యశోధన పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్వరలో ఆయనను వ్యక్తిత్వ, మానసిక నిపుణులూ పరీక్షించనున్నారు. సల్వీందర్ ిప్రస్తుతం 75వ పంజాబ్ సాయుధ పోలీస్‌కు అసిస్టెంట్ కమాండెంట్. పఠాన్‌కోట్ దాడిపై పాక్ జదర్యాప్తు పురోగతిని నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దాడి సూత్రధారులను చట్టానికి పట్టించే విషయంలో పాక్ కచ్చితమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామది.
పాక్ వర్సిటీపై బుధవారం జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ పాత్ర ఉందన్న ఆరోపణలను నిరాధారమైనవిగా విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ కొట్టివేశారు. కాగా, పఠాన్‌కోట్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని గురువారం వేకువజామున బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. అతడితో పాటు వచ్చిన మరో ఇద్దరు వెనక్కు పారిపోయారు.
ప్రాణహాని లేదు..: దేశవ్యాప్తంగా అన్ని కీలక రక్షణరంగ స్థావరాల భద్రతను క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించనుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. కమాండింగ్ అధికారులు తమ స్థావరాలను క్షుణ్ణంగా పరిశీలించి, భద్రతాపరమైన లోపాలేవైనా ఉంటే సరిదిద్దాలని సూచించారు. ఎన్సీసీ క్యాడెట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి తనకు గాని, ప్రధాని మోదీకి గానీ ఎలాంటి ప్రాణ హాని లేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ స్పష్టం చేశారు. మోదీని, పరీకర్‌ను హతమారుస్తామంటూ గోవా సెక్రటేరియట్‌కు వచ్చిన పోస్ట్‌కార్డ్‌పై ఆయన పై విధంగా స్పందించారు.