Special surveillance teams
-
నకిలీ బయో కంపెనీలపై దర్యాప్తు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: అనుమతి లేని బయో కంపెనీలపై దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. నకిలీ బయో పెస్టిసైడ్స్‌తో రైతుల్ని నట్టేట ముంచుతున్న కంపెనీలపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాపారం వెనకున్న వాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ’బయో మాయ’ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై మంత్రి కన్నబాబు స్పందించారు. బయో ఉత్పత్తుల పేరిట కొన్ని సంస్థలు నకిలీలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులు వేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్న బయో పెస్టిసైడ్స్ తయారీ సంస్థలను కట్టడి చేస్తామన్నారు. ఈ వ్యవహారమై సీఎం జగన్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. పూర్తి వివరాలతో మంగళవారం మీడియాతో మాట్లాడతానని చెప్పారు. స్పందించిన అధికారులు.. ‘బయో మాయ’ కథనంపై అధికారులు స్పందించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతితో పాటు, ఏడీఏలు సమావేశమయ్యారు. నకిలీ బయోఉత్పత్తుల తయారీదారులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఐదు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసి ఎఫ్సీఓ యాక్ట్ అమలయ్యేలా చూడాలని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్లతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఎఫ్సీఓ యాక్ట్‌పై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. వెంటనే డీలర్ల వద్ద ఉన్న నకిలీ బయోలను ఉత్పత్తిదారులకు తిప్పి పంపేలా నోటీసులు జారీ చేయాలన్నారు. నకిలీ బయో ఉత్పత్తులు అమ్మితే ఎఫ్సీఓ యాక్ట్ 1985 (ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ అధికారులు ఏడీఏ హేమలత ఆధ్వర్యంలో గుంటూరు పట్నంబజారులో పురుగు మందుల షాపుల్లో తనిఖీలు చేశారు. విశ్వనాథ ట్రేడర్స్ లైసెన్సు పదిరోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. సదరు షాపులోని ఉత్పత్తుల నమూనాలను పరీక్షలకు తిరుపతిలోని రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్‌కు పంపినట్టు అధికారులు చెప్పారు. చట్టం కచ్చితంగా అమలు ఇప్పటివరకు జీవో నంబర్ ఎస్18, హైకోర్టు ఆదేశాల ప్రకారం బయో ప్రొడక్ట్స్ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం నోటిఫికేషన్ ఎస్వో నంబర్ 882 (ఇ) ప్రకారం బయో ప్రొడక్ట్స్ అన్నింటినీ స్టిమ్యులెన్స్గా పేర్కొని.. అన్ని ప్రొడక్ట్స్‌ను ఫెర్టిలైజర్ (కంట్రోల్) ఆర్డర్–1985 పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. బయో స్టిమ్యులెంట్స్ వ్యాపారం చేయదలచిన డీలర్లందరూ ఆ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని జేడీ తెలిపారు. -
‘వరంగల్ బ్యాలెట్’పై అభ్యర్థుల ఫొటో
♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ♦ ఉపపోరు బరిలో 23 మంది ♦16 వరకు ఓటరు నమోదు గడువు పొడిగింపు ♦ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించే విధానం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభం కానుంది. బ్యాలెట్ పేపర్‌పై ఉండే పేరు, పార్టీ పేరు, చిహ్నం ఆధారంగా ఇప్పటి వరకు ఓటర్లు తాము ఓటేయాలనుకుంటున్న అభ్యర్థిని గుర్తు పట్టేవారు. అయితే, అభ్యర్థుల పేర్లు, చిహ్నాల్లో దగ్గరి పోలికలు ఉంటే ఓటర్లు గందరగోళానికి గురై వేరే అభ్యర్థికి ఓటేయడంతో ఫలితాలు తారుమారైన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈవీఎం పెట్టెలపై అతికించే బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బిహార్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయగా, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ద్వారా తెలంగాణలో సైతం ఇది అమల్లోకి వస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని భన్వర్‌లాల్ తెలిపారు. గతం లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేదని, అయితే చలికాలం నేపథ్యంలో త్వరగా చీకటిపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఏడు నామినేషన్ల తిరస్కరణ మొత్తం 38 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, 8మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, 23మంది అభ్యర్థులు పోటీలో మిగిలారన్నారు. పోలింగ్ కోసం 16 మంది ఓ బ్యాలెట్, ఏడుగురు అభ్యర్థులతో మరో బ్యాలెట్‌ను వినియోగిస్తామన్నారు. 1,778 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఇప్పటికే 15,09,671మంది ఓటర్లు జాబితాలో ఉండగా, మరో లక్ష మంది కొత్త ఓటర్లకు అవకాశముందన్నారు. ఓటరు నమోదుకు గడువును ఈ నెల 16 వరకు పొడిగించామన్నారు. 8790499899 టోల్‌ఫ్రీ నంబర్‌కు గైఖీఉ ్ఱఠిౌ్ట్ఛటఐఈ ూౌా అని ఎస్ఎంఎస్ పంపి ఓటరు జాబితాలో పేరు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చన్నారు. బూత్ స్థాయి అధికారులే ఇంటింటికీ తిరిగి ఓటరు చిట్టీలను అందజేస్తారన్నారు. బందోబస్తు కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, అదనంగా 5 వేలకు పైగా రాష్ట్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భూపాలపల్లిలో కట్టుదిట్టమైన భత్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా కోసం 148 ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలపై వెబ్ కెమెరాలతో లైవ్ పర్యవేక్షణ ఉంటుందని, ఈ సదుపాయం లేనిచోట కెమెరాలతో రికార్డింగ్ చేస్తామన్నారు.