‘వరంగల్ బ్యాలెట్’పై అభ్యర్థుల ఫొటో
♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్
♦ ఉపపోరు బరిలో 23 మంది
♦16 వరకు ఓటరు నమోదు గడువు పొడిగింపు
♦ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించే విధానం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభం కానుంది. బ్యాలెట్ పేపర్‌పై ఉండే పేరు, పార్టీ పేరు, చిహ్నం ఆధారంగా ఇప్పటి వరకు ఓటర్లు తాము ఓటేయాలనుకుంటున్న అభ్యర్థిని గుర్తు పట్టేవారు. అయితే, అభ్యర్థుల పేర్లు, చిహ్నాల్లో దగ్గరి పోలికలు ఉంటే ఓటర్లు గందరగోళానికి గురై వేరే అభ్యర్థికి ఓటేయడంతో ఫలితాలు తారుమారైన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈవీఎం పెట్టెలపై అతికించే బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయగా, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ద్వారా తెలంగాణలో సైతం ఇది అమల్లోకి వస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని భన్వర్‌లాల్ తెలిపారు. గతం లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేదని, అయితే చలికాలం నేపథ్యంలో త్వరగా చీకటిపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఏడు నామినేషన్ల తిరస్కరణ
మొత్తం 38 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, 8మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, 23మంది అభ్యర్థులు పోటీలో మిగిలారన్నారు. పోలింగ్ కోసం 16 మంది ఓ బ్యాలెట్, ఏడుగురు అభ్యర్థులతో మరో బ్యాలెట్‌ను వినియోగిస్తామన్నారు. 1,778 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఇప్పటికే 15,09,671మంది ఓటర్లు జాబితాలో ఉండగా, మరో లక్ష మంది కొత్త ఓటర్లకు అవకాశముందన్నారు.
ఓటరు నమోదుకు గడువును ఈ నెల 16 వరకు పొడిగించామన్నారు. 8790499899 టోల్‌ఫ్రీ నంబర్‌కు గైఖీఉ ్ఱఠిౌ్ట్ఛటఐఈ ూౌా అని ఎస్‌ఎంఎస్ పంపి ఓటరు జాబితాలో పేరు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చన్నారు. బూత్ స్థాయి అధికారులే ఇంటింటికీ తిరిగి ఓటరు చిట్టీలను అందజేస్తారన్నారు. బందోబస్తు కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, అదనంగా 5 వేలకు పైగా రాష్ట్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భూపాలపల్లిలో కట్టుదిట్టమైన భత్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా కోసం 148 ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలపై వెబ్ కెమెరాలతో లైవ్ పర్యవేక్షణ ఉంటుందని, ఈ సదుపాయం లేనిచోట కెమెరాలతో రికార్డింగ్ చేస్తామన్నారు.