అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన
10నుంచి 14కు..
సాక్షి, నెల్లూరు : రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సివుంది. ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో పునర్విభజన ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పునర్విభజన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 14కు పెరగనుంది.
నూతనంగా అల్లూరు, రాపూరు, వింజమూరుతో పాటు నాయుడుపేట లేదా నెల్లూరు సెంట్రల్ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలో విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల తర్వాత రెండు లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు 5కి పెరగనున్నాయి. వీటిలో నెల్లూరులో ఏదో ఒక నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్‌కానున్నట్లు సమాచారం.
అయితే పునర్విభజన ప్రక్రియలో అధికార పార్టీ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను కలిపి అదనపు నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు పాత నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు జిల్లాలోని నియోజకవర్గాల ముఖచిత్రం ఇలా ఉండనుంది.