Spicejet Aeroplane
-
కోల్‌కతాలో అత్యవసరంగా దిగిన విమానం
కోల్‌కతా: ముంబై నుంచి గువాహటి వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రమంలో అత్యవసరంగా కిందికి దించారు. ఇంధనం లీక్ అవుతున్నట్లు పైలట్ అనుమానించి బుధవారం ఉదయం కోల్‌కతా విమానాశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో అత్యవసరంగా కిందకు దించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానం విమానాశ్రమంలోనే ఉందని, చివరి నివేదిక వచ్చే వరకు విమానం అధికారిక నిర్వహణలోనే ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. విమానంలోని 180 మంది ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై కోల్‌కతా విమానాశ్రయం డైరెక్టర్ కౌశిక్ భట్టచార్య మాట్లాడుతూ.. ‘ఈ స్పైస్ జెట్ విమాన పైలెట్ ఇంధనం లీకేజీ అవుతున్నట్లు అనుమానంగా ఉందని.. విమానాన్ని అత్యవసరంగా దించాలనుకుంటున్నట్టు కోల్‌కతా ఏటీసీకి ఈ ఉదయం 8:45 గంటలకు సమాచారం అందించాడు. దీంతో 8:58కి విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించాం. ఇంధన లీకేజీతో విమానాలను నిలిపివేసిన సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి. దీనిపై సివిల్ ఏవియేషన్ సిబ్బందికి సమాచారం అందిచాము. వారు ప్రయాణీకులందరినీ సురక్షితంగా దించేశారు. ప్రస్తుతం విమానం నిర్వహణలో ఉంద’ని వెల్లడించారు. -
అక్రమ చొరబాటు.. హెలికాప్టర్ ధ్వంసం..!
-
అక్రమ చొరబాటు.. హెలికాప్టర్ ధ్వంసం..!
భోపాల్ : భోపాల్‌లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమానం ముందు బైఠాయించాడు. వెంటనే స్పందించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అతన్ని అదుపులోకి తీసుకుని.. స్థానిక పోలీసులకు అప్పగించింది. ఆగంతకుణ్ణి యోగేశ్ త్రిపాఠీ (20)గా గుర్తించారు. యోగేశ్ దాడి చేసిన హెలికాప్టర్ రాధాస్వామి సత్సంగ్ బియాస్‌కు చెందినది కావడం గమనార్హం. రాళ్లతో దాడి చేయడంతో హెలికాప్టర్ ముందు భాగం ధ్వంసమైంది. యోగేశ్ ఏ ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా అతను మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉద్రిక్తత నేపథ్యంలో.. ఉదయ్‌పూర్‌కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం గంట ఆలస్యంగా నడిచిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
రన్‌వేపైకి స్పైస్‌జెట్ విమానం
– నేటినుంచి యథావిధిగా విమాన రాకపోకలు రేణిగుంటః రేణిగుంటలో బురదలో కూరుకుపోయిన విమానాన్ని ఆదివారం రాత్రి రన్‌వేపైకి తీసుకొచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో శనివారం రాత్రి స్పైస్‌జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటి బురదలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. విమాన ప్రమాద విషయం తెలుసుకున్న విమానయానశాఖ అధికారులు ఢిల్లీ నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు. స్పైస్‌జెట్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. సుమారు 20టన్నులకు పైగా బరువుతో బురద మట్టిలో దిగబడిన విమానాన్ని రన్‌వే పైకి లాక్కొచ్చేందుకు ఆదివారం ఉదయం నుంచి మూడు భారీ క్రేన్ల సాయంతో సిబ్బంది ప్రయత్నించారు. చివరకు రాత్రి 7.30 గంటలకు రన్‌వే మీద పార్కింగ్ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకటకిషోర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. దీంతో సోమవారం నుంచి ఇక్కడి నుంచి విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా తెలిపారు. ప్రయాణికుల అవస్థలు రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆదివారం పూర్తిగా విమాన సర్వీసులు నిలిపివేస్తూ కేంద్ర విమానయాన శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా శనివారం రాత్రి టేకాఫ్ కాకుండా ఇక్కడే నిలిచిపోయిన ట్రూజెట్ విమానాన్ని వూత్రం ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు పంపారు. దీనిని మినహాయిస్తే మిగిలిన విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.