Spirit cousin
-
మానసిక ఒత్తిడి మాయే!
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసునుంచి వచ్చాడు. కానీ రేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. కాఫీ ఇస్తే ఏదో అలా తాగేశాడు. పిల్లలు దగ్గరకు వచ్చినా పట్టించుకోలేదు. అతను ఏదో ఒత్తిడిలో ఉన్నాడని రేఖకు అర్థమైంది. అదే విషయం అడిగింది. ‘‘అలాంటిదేం లేదోయ్’’ అన్నాడు. ‘‘మరి అలా ఎందుకున్నారు?’’ ‘‘ఎలా ఉన్నాను? బానే ఉన్నాగా?’’ ‘‘మీరు మామూలుగా లేరు. ఆఫీసులో ఏదైనా ఒత్తిడా?’’ ‘‘అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నా. ఆఫీసులో కూడా బాగానే ఉంది. ఏదో చిన్న ఒత్తిడి. అంతే. ఉద్యోగం అన్న తర్వాత అవన్నీ తప్పవుగా.’’ ‘‘చిన్న ఒత్తిడి అని వదిలేస్తే పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది ఆనంద్.’’ ‘‘అలాంటిదేం లేదులే. అది చాలా చిన్న సమస్య. ఐ కెన్ మేనేజ్.’’ ఆనంద్ అలా చెప్తున్నా... ఆ సమస్యను మేనేజ్ చేయలేకనే ఒత్తిడి ఫీల్ అవుతున్నాడని రేఖకు అర్థమైంది. ఆ విషయం అతనికి ప్రాక్టికల్‌గా చెప్పాలనుకుంది. ‘‘ఆనంద్... ఓ చిన్న పని చేయ గలవా?’’ మర్నాడు అడిగింది రేఖ. ‘‘హా.. చెప్పు’’ అన్నాడు ఆనంద్. ‘‘కొంచెం ఈ కప్పు పట్టుకోవా?’’ అని చిన్న కప్పు చేతికిచ్చింది. ‘‘ఆ మాత్రం దానికేనా?’’ అంటూ కప్పు అందుకున్నాడు. ‘‘నేను చెప్పేంతవరకూ ఆ కప్పు కింద పెట్టకూడదు’’ అంది రేఖ. ‘‘ఒహ్హో... ఈ చిన్న కప్పును పట్టుకోలేనా?’’ ‘‘పట్టుకోండి సార్ చూద్దాం.’’ ఆనంద్ ఆ కప్పును అలా పట్టుకుని నిల్చున్నాడు. రేఖ వంట చేసుకుంటోంది. పది నిమిషాలకు కప్పు బరువుగా అనిపించింది ఆనంద్కి. పావు గంటకు చెయ్యి గుంజడం మొదలెట్టింది. అరగంట తర్వాత ఇక భరించలేననుకున్నాడు. కప్పును చేయి మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ‘‘హలో మిస్టర్ ఆనంద్... మీరు అదే చేత్తో పట్టుకోవాలి. చేయి మార్చుకోవడం కుదరదు’’ అంది రేఖ. ‘‘అరగంట పట్టుకునేసరికి చేయి గుంజుతుందోయ్’’ చెప్పాడు ఆనంద్. ‘‘కదా... అలాగే చిన్న ఒత్తిడిని ఎక్కువకాలం భరించినా ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది సర్’’ అంది నవ్వుతూ. ‘‘ఓహ్... నిన్న నేనన్న మాటలకు రిటార్డా?’’ అంటూ కప్పు కింద పెట్టాడు. ‘‘రిటార్డేం కాదు. చిన్న ఒత్తిడని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాలనీ...’’ ‘‘చెప్పాలనుకుంటే డెరైక్ట్‌గా చెప్పొచ్చుగా... ఇలా ఎందుకు?’’ ‘‘డెరైక్ట్‌గా చెప్తే తమరికి నచ్చదుగా. అందుకే ప్రాక్టికల్‌గా చూపిద్దామనీ...’’ ‘‘అబ్బో... స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ కూడా చెప్తావా ఏంటీ?’’ ‘‘ఏం... చెప్పకూడదా ఏంటీ?’’ ‘‘నాకు తెలియని టిప్స్ నువ్వేం చెప్తావోయ్?’’ ‘‘మీకు తెలిసిన టిప్స్ ఏంటో చెప్పండి ముందు.’’ ‘‘రోజూ పొద్దుటే వాకింగ్, యోగా, మెడిటేషన్ చేసాను కదా! అలాగే మా ఆఫీసులో స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎక్స్‌పర్ట్స్‌తో క్లాసులు కూడా చెప్పిస్తుంటారు. వాళ్లు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు.’’ ‘‘మరి చేస్తున్నారా?’’ ‘‘అప్పుడప్పుడూ. అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చేస్తున్నా.’’ ‘‘మరి తగ్గుతుందా?’’ ‘‘తగ్గుతుంది... మళ్లీ వస్తుంది.’’ ‘‘కదా... మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... అసలది లేదనే విషయం తెలుసుకోవాలి.’’ ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ‘‘ఏంటీ... మానసిక ఒత్తిడనేది లేదా? ఎవరైనా వింటే జనాలు నవ్వుతారు. ఒత్తిడి తట్టుకోలేక లక్షలాదిమంది బాధపడు తుంటే నువ్వు ఒత్తిడనేదే లేదంటావేం?’’ ‘‘సరే ఉంది. కానీ ఆ ఒత్తిడి సృష్టిస్తున్నది ఎవరు?’’ ‘‘ఎవరంటే... దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలా చెప్పడం?’’ ‘‘మీరెన్ని కారణాలు చెప్పినా అవి సెకెండరీ. మీరెన్ని టిప్స్ పాటించినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... దాని మూలం తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ కొన్ని సామర్థ్యాలూ, అంచనాలూ ఉంటాయి. అంచనాలకు, ఆశయాలకూ తగ్గ సామర్థ్యా లున్నప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అంచనాలకూ సామర్థ్యాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ‘‘అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలంటే అంచనాలు తగ్గించుకోవాలి, లేదంటే అంచనాలకు అందుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి. అంతే తప్ప మరేం చేసినా అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే.’’ ‘‘నువ్వు చెప్పింది నిజమేనోయ్. థ్యాంక్స్.’’ అంటూ ముద్దిచ్చాడు ఆనంద్. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
దూరం పెరగనివ్వొద్దు!
ఆత్మబంధువు ట్రింగ్.. ట్రింగ్.. ట్రింగ్... ఫోన్ రింగవుతోంది. పొద్దుటే ఎవరా అని మొబైల్ వైపు చూసింది రేఖ. తన చెల్లెలు ఉష. హుషారుగా లిఫ్ట్ చేసి ‘‘హాయ్ రా...’’ అంది. ‘‘అక్కా....’’ ఉష ఏడుస్తోంది. ‘‘ఏంటే... ఏమైంది?’’ అంది కంగారుగా. ‘‘కిరణ్...’’ ‘‘కిరణ్‌కి ఏమైంది?’’ ఆదుర్దాగా అడిగింది రేఖ. ‘‘ఏం కాలేదు.’’ ‘‘మరెందుకే ఏడుస్తున్నావ్?’’ ‘‘కిరణ్‌కి ఎవరితోనో అఫైర్ ఉన్నట్లుందక్కా...’’ అని భోరుమంది ఉష. ‘‘నిజమా? తనకి అఫైర్ ఉందని నీకెలా తెలుసు?’’ ‘‘ఉదయం లేస్తూనే మొబైల్ చూసుకుంటాడక్కా. మొబైల్ చూసి నవ్వుకుంటాడు. ఎప్పుడూ మెసేజ్‌లు చేస్తూనే ఉంటాడు.’’ ‘‘మొబైల్ చూస్తుంటే అఫైర్ ఉన్నట్లేనా ఉషా?’’ ‘‘నన్నసలు పట్టించుకోవడం లేదక్కా. పొద్దున లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌తోనే కాపురం’’... ఏడుపు ఆపడం లేదు ఉష. ‘‘ఓకే.. నువ్వతని మొబైల్ చెక్ చేశావా. ఏమైనా క్లూ దొరికిందా?’’ ‘‘ఓ రోజు తను నిద్రపోతున్న ప్పుడు చూశాను. ఏం కనిపించలేదు.’’ ‘‘సరే.. ఓ రెండ్రోజులు తన మొబైల్ నీకివ్వమని అడుగు. అతనికొచ్చే కాల్స్ ఏంటో నీకు తెలుస్తాయిగా. గాళ్‌ఫ్రెండ్ ఉంటే తెలిసిపోతుందిగా.’’ ‘‘ఆ పనీ చేశాను. కానీ ఏమీ తెలియలేదు. అన్నీ మామూలు కాల్సే.’’ నిట్టూర్చింది రేఖ. ‘‘మ్మ్... నువ్వతన్ని ఏమైనా అడిగావా?’’ అంది. ‘‘లేదక్కా.. అడుగుదామనుకున్నా. కానీ ఎలా రియాక్టవుతాడోనని భయపడి అడగలేదు.’’ ‘‘సరే నువ్వేం అడక్కు. నేనొచ్చి మాట్లాడతాలే.’’ అక్క ఇచ్చిన భరోసాతో సరే అనేసి ఫోన్ పెట్టేసింది ఉష. ‘‘హాయ్ కిరణ్..’’ అంటూ ఇంట్లోకి వచ్చింది రేఖ. ‘‘వదినగారూ... రండి రండి. ఏంటి సర్ప్రైజ్ విజిట్’’ అంటూ ఆహ్వానించాడు కిరణ్. ‘‘ఉషా... ఎవరొచ్చారో చూడు’’ అంటూ భార్యను పిలిచాడు. ‘‘హాయ్ అక్కా. రా రా. కూర్చో. ఎలా ఉన్నావ్? బావగారు, బుజ్జీ, చిన్నూ ఎలా ఉన్నారు?’’ అంటూ వచ్చింది ఉష. కుశల ప్రశ్నలు అయ్యాక... ‘‘ కిరణ్‌తో మాట్లాడుతుండు. నేను స్నాక్స్ తీసు కొస్తా’’ అంటూ వంటింట్లోకి వెళ్లింది ఉష. ‘‘ఏంటి కిరణ్.. ఏంటీ విశేషాలు? హౌ ఈజ్ యువర్ జాబ్? ఎనీ ప్లాన్స్ టూ గో అబ్రాడ్?’’ అంటూ కిరణ్‌ని కదిలించింది రేఖ. ‘‘మే బీ ఈ ఇయర్ చాన్స్ రావచ్చండీ కంపెనీ తరఫున’’ అంటూ మొబైల్ చూసుకున్నాడు కిరణ్. చాన్స దొరికినట్టయ్యింది రేఖకి. ‘‘ఏంటీ కొత్త మొబైలా?’’ అడిగింది. ‘‘ఔనండీ.. ఐఫోన్ సిక్స్ ప్లస్. బుక్స్ చదవడానికి బావుంటుందని కొన్నా.’’ ‘‘ఫోన్లో బుక్స్ చదువుతావా?’’ ‘‘ఔనండీ. ఇ-బుక్స్. నేను బుక్ లవర్‌నని మీకూ తెలుసుగా! మామూ లుగా అయితే ఒకటో రెండో బుక్స్ పట్టుకెళ్లగలను. దీన్లో అయితే ఎన్నయినా తీసుకెళ్లొచ్చు. అలాగే వాట్సాప్‌లో ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. దాన్లో జోక్స్ షేర్ చేసుకుంటాం. ప్రొఫెషనల్ గ్రూప్‌లో ప్రొఫెషనల్ డిస్కషన్స్. జీమెయిల్, ఫేస్ బుక్, ట్విటర్, మ్యూజిక్, యూట్యూబ్... ఇంకా చాలా! ఇది కొన్నాక చాలా టైమ్ సేవ్ అవుతోంది. మెయిల్స్, ఫేస్బుక్ కూడా దీన్లోనే చెక్ చేసుకోవచ్చు.’’ ‘‘చూస్తుంటే ఆ మొబైల్‌తో ప్రేమలో పడినట్లున్నావే’’ అంది రేఖ నవ్వుతూ. కిరణ్ కూడా నవ్వేశాడు. ‘‘మొబైల్ అనేది కచ్చితంగా అవసరమే కిరణ్. కానీ ఆ అవసరాన్ని అడిక్షన్ కానివ్వకూడదు. అయినవాళ్లతో గడిపే సమయాన్ని ఫోన్‌తో గడపడం మొదలుపెడితే... బాంధవ్యాలు దెబ్బ తింటాయి. భార్యాభర్తల మధ్య దూరాలు పెరుగుతాయి. ఆ దూరం విలువ మన ఆనందం.’’ కిరణ్ ఆలోచనలో పడ్డాడు. తాను వచ్చిన పని పూర్తయ్యిందని అర్థమైన రేఖ వెళ్లడానికి లేచింది. కర్టెన్ చాటు నుంచి చూస్తోన్న ఉష ముఖంలో ఆనందాన్ని చూసి తృప్తిగా వెళ్లిపోయింది. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్