దూరం పెరగనివ్వొద్దు!
ఆత్మబంధువు
ట్రింగ్.. ట్రింగ్.. ట్రింగ్... ఫోన్ రింగవుతోంది. పొద్దుటే ఎవరా అని మొబైల్ వైపు చూసింది రేఖ. తన చెల్లెలు ఉష. హుషారుగా లిఫ్ట్ చేసి ‘‘హాయ్ రా...’’ అంది.
‘‘అక్కా....’’ ఉష ఏడుస్తోంది.
‘‘ఏంటే... ఏమైంది?’’ అంది కంగారుగా.
‘‘కిరణ్...’’
‘‘కిరణ్‌కి ఏమైంది?’’ ఆదుర్దాగా అడిగింది రేఖ.
‘‘ఏం కాలేదు.’’
‘‘మరెందుకే ఏడుస్తున్నావ్?’’
‘‘కిరణ్‌కి ఎవరితోనో అఫైర్ ఉన్నట్లుందక్కా...’’ అని భోరుమంది ఉష.
‘‘నిజమా? తనకి అఫైర్ ఉందని నీకెలా తెలుసు?’’
‘‘ఉదయం లేస్తూనే మొబైల్ చూసుకుంటాడక్కా. మొబైల్ చూసి నవ్వుకుంటాడు. ఎప్పుడూ మెసేజ్‌లు చేస్తూనే ఉంటాడు.’’
‘‘మొబైల్ చూస్తుంటే అఫైర్ ఉన్నట్లేనా ఉషా?’’
‘‘నన్నసలు పట్టించుకోవడం లేదక్కా. పొద్దున లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌తోనే కాపురం’’... ఏడుపు ఆపడం లేదు ఉష.
‘‘ఓకే.. నువ్వతని మొబైల్ చెక్ చేశావా. ఏమైనా క్లూ దొరికిందా?’’
‘‘ఓ రోజు తను నిద్రపోతున్న ప్పుడు చూశాను. ఏం కనిపించలేదు.’’
‘‘సరే.. ఓ రెండ్రోజులు తన మొబైల్ నీకివ్వమని అడుగు. అతనికొచ్చే కాల్స్ ఏంటో నీకు తెలుస్తాయిగా. గాళ్‌ఫ్రెండ్ ఉంటే తెలిసిపోతుందిగా.’’
‘‘ఆ పనీ చేశాను. కానీ ఏమీ తెలియలేదు. అన్నీ మామూలు కాల్సే.’’
నిట్టూర్చింది రేఖ. ‘‘మ్‌మ్... నువ్వతన్ని ఏమైనా అడిగావా?’’ అంది.
‘‘లేదక్కా.. అడుగుదామనుకున్నా. కానీ ఎలా రియాక్టవుతాడోనని భయపడి అడగలేదు.’’
‘‘సరే నువ్వేం అడక్కు. నేనొచ్చి మాట్లాడతాలే.’’
అక్క ఇచ్చిన భరోసాతో సరే అనేసి ఫోన్ పెట్టేసింది ఉష.
‘‘హాయ్ కిరణ్..’’ అంటూ ఇంట్లోకి వచ్చింది రేఖ.
‘‘వదినగారూ... రండి రండి. ఏంటి సర్‌ప్రైజ్ విజిట్’’ అంటూ ఆహ్వానించాడు కిరణ్. ‘‘ఉషా... ఎవరొచ్చారో చూడు’’ అంటూ భార్యను పిలిచాడు.
‘‘హాయ్ అక్కా. రా రా. కూర్చో. ఎలా ఉన్నావ్? బావగారు, బుజ్జీ, చిన్నూ ఎలా ఉన్నారు?’’ అంటూ వచ్చింది ఉష.
కుశల ప్రశ్నలు అయ్యాక... ‘‘ కిరణ్‌తో మాట్లాడుతుండు. నేను స్నాక్స్ తీసు కొస్తా’’ అంటూ వంటింట్లోకి వెళ్లింది ఉష.
‘‘ఏంటి కిరణ్.. ఏంటీ విశేషాలు? హౌ ఈజ్ యువర్ జాబ్? ఎనీ ప్లాన్స్ టూ గో అబ్రాడ్?’’ అంటూ కిరణ్‌ని కదిలించింది రేఖ.
‘‘మే బీ ఈ ఇయర్ చాన్స్ రావచ్చండీ కంపెనీ తరఫున’’ అంటూ మొబైల్ చూసుకున్నాడు కిరణ్.
చాన్‌స దొరికినట్టయ్యింది రేఖకి. ‘‘ఏంటీ కొత్త మొబైలా?’’ అడిగింది.
‘‘ఔనండీ.. ఐఫోన్ సిక్స్ ప్లస్. బుక్స్ చదవడానికి బావుంటుందని కొన్నా.’’
‘‘ఫోన్‌లో బుక్స్ చదువుతావా?’’
‘‘ఔనండీ. ఇ-బుక్స్. నేను బుక్ లవర్‌నని మీకూ తెలుసుగా! మామూ లుగా అయితే ఒకటో రెండో బుక్స్ పట్టుకెళ్లగలను. దీన్లో అయితే ఎన్నయినా తీసుకెళ్లొచ్చు. అలాగే వాట్సాప్‌లో ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. దాన్లో జోక్స్ షేర్ చేసుకుంటాం. ప్రొఫెషనల్ గ్రూప్‌లో ప్రొఫెషనల్ డిస్కషన్స్. జీమెయిల్, ఫేస్ బుక్, ట్విటర్, మ్యూజిక్, యూట్యూబ్... ఇంకా చాలా! ఇది కొన్నాక చాలా టైమ్ సేవ్ అవుతోంది. మెయిల్స్, ఫేస్‌బుక్ కూడా దీన్లోనే చెక్ చేసుకోవచ్చు.’’
‘‘చూస్తుంటే ఆ మొబైల్‌తో ప్రేమలో పడినట్లున్నావే’’ అంది రేఖ నవ్వుతూ. కిరణ్ కూడా నవ్వేశాడు.
‘‘మొబైల్ అనేది కచ్చితంగా అవసరమే కిరణ్. కానీ ఆ అవసరాన్ని అడిక్షన్ కానివ్వకూడదు. అయినవాళ్లతో గడిపే సమయాన్ని ఫోన్‌తో గడపడం మొదలుపెడితే... బాంధవ్యాలు దెబ్బ తింటాయి. భార్యాభర్తల మధ్య దూరాలు పెరుగుతాయి. ఆ దూరం విలువ మన ఆనందం.’’
కిరణ్ ఆలోచనలో పడ్డాడు. తాను వచ్చిన పని పూర్తయ్యిందని అర్థమైన రేఖ వెళ్లడానికి లేచింది. కర్టెన్ చాటు నుంచి చూస్తోన్న ఉష ముఖంలో ఆనందాన్ని చూసి తృప్తిగా వెళ్లిపోయింది.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్