స్పిరిట్ ఫ్యాక్టరీ వద్దు
♦ రేకులకుంట గ్రామస్తుల రాస్తారోకో
♦ 2 గంటల పాటు స్తంభించిన రాకపోకలు
♦ తహశీల్దార్ హామీతో శాంతించిన ఆందోళనకారులు
బుక్కరాయసముద్రం: రేకులకుంటలో ఆల్కహాల్ స్పిరిట్ తయారీ ఫ్యాక్టరీ వల్ల తమ పొలాలకు నష్టం వాటిల్లుతోందని గ్రామస్తులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అనంతపురం–నార్పల రహదారిపై 2 గంటల పాటు వాహనాలు నిలచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లా ఎస్టీ సెల్ అధక్షుడు సాకే రామకృష్ణ, మాజీ సర్పంచ్ సాకే నారాయణస్వామి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేకులకుంటలో స్పిరిట్ ఫ్యాక్టరీ ప్రజల అనుమతితో ఏర్పాటు చేయలేదన్నారు.
దీనివల్ల పంటపొలాలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయని విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ఫ్యాక్టరీని మూసివేసేలా చర్యలు చేపట్టి పంట పొలాలను కాపాడాలన్నారు. తహశీల్దార్ గాండ్ల రామకృష్ణయ్య అక్కడకు చేరుకుని కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌తో గ్రామస్థులను సమావేశపరచి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎంపీటీసీ లక్షి్మనారాయణ రాజు, సర్పంచ్ ఆదిశేషయ్య, వైఎస్సార్సీపీ నాయకులు మల్లికార్జున, లక్షి్మనారాయణ, కుళ్లాయప్ప, తిరుపతయ్య, రాజు, నారాయణస్వామి పాల్గొన్నారు.