ఉదయం వేళ వ్యాయామం ఎలా మేలు చేస్తుంది?
వ్యాయామం ఉదయం వేళలోనే చేయాలని చెబుతుంటారు. దీనికి ఏదైనా కారణం ఉందా? దయచేసి వివరించండి.
- సుకుమార్, హైదరాబాద్
పూర్వకాలం నుంచి చాలా పనులు ప్రాతఃకాలంలోనే మొదలుపెట్టి ఎండ ముదిరే వేళకు కాస్త విరామం ఇచ్చి, చల్లబడే వేళకు మళ్లీ మొదలుపెట్టేవారు. పొలం పనులు, తోట పనులు, చేపలు పట్టడం వంటివాటిని సూర్యోదయం కాకముందునుంచే మొదలుపెట్టేవారు. అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయడం అన్నది మొదటి నుంచీ ఉన్న అభ్యాసమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి...
ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి త్వరగా అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసట పెరుగుతుంది.
ఉదయం వేళలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి
న్యూరోట్రాన్స్మిటర్ల, హార్మోన్ల, ఎంజైమ్‌ల పనితీరు ఉదయం వేళల్లో బాగుంటుంది.
ఆ మూఢనమ్మకం వెనక శాస్త్రీయత ఇదే...
రాత్రుళ్లు దెయ్యాలు సంచరిస్తుంటాయానే మూఢనమ్మకం కొందరిలో బలపడటానికి కారణాన్ని చూద్దాం. ఈ మూఢనమ్మకం ప్రాచుర్యంలోకి రావడానికి శాస్త్రీయ కారణం ఉంది. మన దేశంలో పొలాల్లో పని చేసే వారు అక్కడే ఉండిపోవాల్సి వస్తే రాత్రుళ్లు చెట్ల కింద పడుకునే వారు. రాత్రివేళల్లో చెట్లలో కిరణజన్యసంయోగ క్రియ జరగదు. కేవలం శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. కాబట్టి రాత్రివేళల్లో చెట్లు ఆక్సిజన్‌ను గ్రహించి, కార్బన్‌డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి.
చెట్లు రాత్రిళ్లు కార్బన్‌డైఆక్సైడ్‌ను వెలువరించే సమయంలో వాటి కింద పడుకున్న వారికి ఊపిరి ఆడదు. దాంతో గుండెల మీద ఎవరో కూర్చున్నట్లు భ్రమపడుతుంటారు. అందుకే ఈ దెయ్యపు భ్రాంతి. ఇక మళ్లీ ఉదయం వేళ సూర్యుడి కిరణాలు ప్రసరించగానే, కిరణజన్య సంయోగ క్రియ మొదలై చెట్లు ఆక్సిజన్‌ను వెలువరించడం ప్రారంభమవుతుంది. అందుకే ఉదయం వేళల్లో వాతావరణంలోకి తాజా ఆక్సిజన్ వెలువడటం జరుగుతుంది కాబట్టి ఆ టైమ్ వ్యాయామానికి మంచి వేళగా పరిగణించవచ్చు. ఇక ఉదయపు సూర్యకాంతి విటమిన్-డి ఉత్పాదనకు తోడ్పడుతుంది. ఆ వేళలో ప్రసరించే అల్ట్రా వయొలెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికడతాయి.
ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మంచిది. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలులు, పరిస్థితుల కారణంగా నిర్దిష్టంగా ఆ వేళలోనే వ్యాయామం చేయాలనే నిబంధన పెట్టుకోకుండా... సమయం, తీరిక దొరికినప్పుడు వ్యాయామం చేయడం మంచిది.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్