sport fixing
-
త్రయంపై నిషేధం కొనసాగుతుంది బీసీసీఐ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన పేసర్ శ్రీశాంత్, స్పిన్నర్ అంకిత్ చవాన్, చండిలాలపై జీవితకాల నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇందులో రెండో ఆలోచన లేదని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ‘బీసీసీఐ క్రమ శిక్షణ కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు. క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు.. రెండు వేర్వేరుగా ఉంటాయి. గతంలో క్రికెటర్లు క్రమశిక్షణ ఉల్లంఘించారని అవినీతి నిరోధక యూనిట్ కూడా నివేదికను ఇచ్చింది. కాబట్టి కమిటీ తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది’ అని ఠాకూర్ పేర్కొన్నారు. -
బీసీసీఐకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్ ఫిక్సింగ్పై బీసీసీఐ నియమించిన ద్విసభ్య కమిటీ విషయమై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే ఈ పిటీషన్ను విచారించేందుకు మాత్రం సుప్రీం కోర్టు సమ్మతించింది. ఐపీఎల్ బెట్టింగ్ ఉదంతంలో చెన్నై ఫ్రాంచైజీ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్కుంద్రాలపై బోర్డు నియమించిన ద్విసభ్య కమిటీ వీరిద్దరికి క్లీన్చిట్ ఇచ్చింది. అయితే ఈ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి రావని బీహార్ క్రికెట్ సంఘం కేసు వేసింది. దీన్ని విచారించిన బాంబే హైకోర్టు ఆ కమిటీ అనైతికమని, రాజ్యాంగబద్ధమైనది కాదని తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ... మధ్యంతర తీర్పు వెలువరించాలని బోర్డు కోరింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ‘స్టే’కు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన బీహార్ క్రికెట్ సంఘాన్ని ఆదేశించింది.