అనంత’ రైతును ఆదుకున్న వైఎస్
భారీ రాయితీలతో రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలు
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న వ్యవసాయ రంగం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి బాట పట్టింది. ప్రధానంగా 2003లో ప్రారంభమైన బిందు( డ్రిప్), తుంపర(స్ప్రింక్లర్లు) సేద్యం పథకం నిత్య క్షామ పీడిత జిల్లా ‘అనంత’లోని రైతుల పాలిట వరమైంది. వైఎస్ సీఎంగా ఉన్న ఆరేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం మేర భారీగా రాయితీలు కల్పించి, అడిగిన వెంటనే డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి సూక్ష్మసాగు సేద్యాన్ని పెంచారు.
ఆయన హయాంలో 2004-05 నుంచి 2009-10 వరకు మొత్తం రూ.277.45 కోట్ల రాయితీలు ఇచ్చి, 1.13 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సాగు పరికరాలు అందించారు. తద్వారా జిల్లాలో పండ్ల తోటల పెంపకం అభివృద్ధి చెందింది. దీంతో జిల్లా ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఖ్యాతినార్జించింది. వైఎస్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోని ఐదేళ్ల వ్యవధిలో జిల్లా రైతులకు గ్రహణం పట్టింది.
దరఖాస్తు చేసుకుని ఏడాది పాటు ఎదురు చూసినా డ్రిప్, స్ప్రింక్లర్లు అందలేదు. ఈ పథకం బడ్జెట్ కుదించడం, ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర రైతులకు భూ విస్తీర్ణాన్ని బట్టి రాయితీలు నిర్దేశించడంతో సూక్ష్మ సాగు సేద్యం అటకెక్కింది. వీరి పాలనలో జిల్లాలో కేవలం 58 వేల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి, రూ.200.98 కోట్లు మాత్రమే రాయితీలు కల్పించారు.