సెల్ఫీ ప్రియులకోసం ఓ బుల్లి ప్రింటర్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ సరికొత్త ప్రింటర్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం ఈ ఫోటో ప్రింటర్‌ను విడుదల చేసింది. భారీగా పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వినియోగం, సెల్ఫీలపై యువత మోజు నేపథ్యంలో ‘స్ప్రోకెట్’ పేరుతో ఈ ప్యాకెట్ ప్రింటర్‌ను తయారు చేసింది. స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దీని ధర రూ .8,999గా నిర్ణయించింది.
ముఖ్యంగా 10-24 వయస్సు మధ్య ఉన్న లక్షలాదిమంది వినియోగదారుల కోసం రూపొందించామనీ హెచ్‌పీ ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ రాజా కుమార్ రిషి తెలిపారు. దీని ద్వారా వినియోగదారులు వారి అద్భుతమైన జ్ఞాపకాలను తక్షణమే ప్రింట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక పోలరాయిడ్ కెమెరాల బడ్జెట్ ధరలతో పోలిస్తే హెచ్‌పీ ప్యాకెట్ ప్రింటర్ ఎక్కువ ధర ఉన్నప్పటికీ, స్మార్ట్ఫోన్లకు ఇది బాగా లాభిస్తుందని భావిస్తున్నారు.
వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుంచి అధికారిక స్ప్రోకెట్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. బ్లూటూత్ ద్వారా దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. దీన్ని అమెజాన్ ఇండియా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎరుపు, నలుపు , తెలుపు రంగుల్లో లభిస్తుంది.