జ్ఞానపూర్ణిమ
స్థితికారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండేది ఈ శ్రావణ పూర్ణిమనాడే. ఈరోజు అనేక పర్వదినాలకు పునాది.
వరాహజయంతి: భూమిని చాప చుట్టలా చుట్టిన హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి వరాహావతారం దాల్చిన ఈరోజున శ్రీమహావిష్ణువును వరాహావతారంలో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం పాపాలను పటాపంచలు చేసి అనేకమైన శుభపలితాలనిస్తుంది.
హయగ్రీవ జయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఉత్తరాయణ పుణ్యకాలం కాకపోయినప్పటికీ ఈ రోజు అక్షరాభ్యాసానికి ఎంతో మంచిదని పిల్లల చేత అక్షరాలు దిద్దించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.
జంధ్యాల పూర్ణిమ: యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ నేడు జీర్ణయజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారం. అందుకే శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు.