మా ఊళ్లో ‘మందు’ షాపు వద్దు
ఎం.సీతారాంపురం(వంగర): మద్యం మహమ్మారి బారినపడి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, గ్రామం నడిబొడ్డున ఉన్న దుకాణాన్ని వెంటనే తరలించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ లెంక రామినాయుడు, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజాన పద్మ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. వీరికి గ్రామంలోని అందరూ సహకరించారు. ఎస్ఆర్బీ మద్యం దుకాణం ఎదుట ధర్నాకు దిగారు. మద్యం మహమ్మారిని తరమివేయాలి, పేదల బతుకులతో ఆడుకుంటున్న మద్యం షాపును ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజాం, పార్వతీపురం పట్టణాలకు వెళ్లే బస్సులను అడ్డగించారు. వీరిని అదుపుచేయడం పోలీసులకు ఎంతో కష్టమైంది. మద్యం దుకాణం ఎత్తివేయాలని మూడేళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం, శ్రీదుర్గాలయం, బీసీ బాలుర వసతి గృహం, జెడ్పీ ఉన్నత పాఠశాల ఉన్న ప్రదేశంలో మద్యం షాపు ఉండడం చట్టరీత్యా నేరమని, తక్షణమే తొలిగించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో షాపు ఉండడంతో యువకులు, విద్యార్థులు మద్యానికి బానిసవుతున్నారని, నిరుపేదలు కూలీ డబ్బులు మద్యానికి పోస్తున్నారని, గ్రామంలో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందారు. అదే సమయంలో అటువైపు వచ్చిన ఎమ్మెల్యే కంబాల జోగులుకు గ్రామస్తులు సమస్యను వివరించారు. మద్యం దుకాణం గ్రామం నుంచి తరలించేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన జోగులు తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదానందం, జోగినాయుడు, తిరుపతిరావు, సుబ్బారావు, రంగునాయుడు, సింహాచలం, గౌరునాయుడు, ఫకీరునాయుడు తదితరులు పాల్గొన్నారు.