భక్తి లేని పూజ!
అది అమరావతి. మహేంద్రపురిలోని ఇంద్రభవంతి. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనకలు సంప్రదాయ వస్త్రాలతో ఒద్దికగా కూర్చుని ఉన్నారు. అష్టదిక్పాలకులు ఆసీనులై ఉన్నారు. దేవగురువు బృహస్పతి ఉచితాసనాన్ని అలంకరించి ఉన్నాడు. గంధర్వులు గానం చేస్తున్నారు. మునులు హోమాలు, యజ్ఞయాగాది క్రతువులలో నిమగ్నమై ఉన్నారు. దేవేంద్రుడు నారాయణ యజ్ఞంలో లీనమై ఉన్నాడు. యజ్ఞపరిసమాప్తి అయింది. ఫలప్రదాత అయిన నారాయణుడు మాత్రం ఆ ఫలాన్ని అందుకోవడానికి రాలేదు. అంతవరకూ యజ్ఞం సజావుగా జరిగిందని సంతోషంగా ఉన్న ఇంద్రుని మోములోని చిరునగవు మాయమై, ఆ స్థానంలో అసంతృప్తి చోటు చేసుకుంది. తనవల్ల ఏమి తప్పిదం జరిగిందోనన్న ఆందోళన మొదలైంది. అసలు తను ఆ యజ్ఞం చేయవలసి వచ్చిన కారణ ం కన్నుల ముందు కదలాడింది. ఓ రోజు ఇలాగే తాను పూజ చే స్తున్నాడు. అయితే పక్కనే అప్సరాంగనల నృత్య ప్రదర్శన, శచీదేవి సపర్యలు సాగుతూ ఉన్నాయి. చేతులు, పెదవులు యాంత్రికంగా పని చేసుకుపోతున్నాయి కానీ, మనసు ఏమాత్రం లగ్నం కావడం లేదు. దాంతో బ్రహ్మదేవుడికి ఆగ్రహం వచ్చింది. ‘‘దేవేంద్రా! ఏ పదవిని, భోగాలని చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావో, అవే నీకిక నిద్రాహారాలను దూరం చేస్తాయి. ఏ పూజాది క్రతువులపైన అయితే, నీవు మనస్సును లగ్నం చేయలేకపోతున్నావో, అదే పూజలు, జపతపహోమాదులతో శ్రీహరిని మెప్పించి మునులు మహేంద్రపదవిని పొందుతారు.
రాక్షసులు నీ మీద దండయాత్రలు చేస్తూ, నీ రాజ్యాన్ని, సింహాసనాన్ని ఆక్రమించుకుంటూ నీకు మనః స్థిమితం లేకుండా చేస్తూ ఉంటారు గాక’’ అని శపించాడు. దాంతో ఇంద్రుడికి తన తప్పిదం తెలిసి వచ్చింది. సురాధిపుడంటే నిత్యం నృత్యగానాలు, అప్సరాంగనల సాంగత్యం, సోమరసపానం కాదని, బాధ్యతాయుతమైన పదవి అని, ఎట్టి పరిస్థితులలోనూ పెద్దలను విస్మరించరాదని గ్రహించాడు. బ్రహ్మ శాపం తిరుగులేనిది. అయితే విష్ణుమూర్తిని వేడుకుంటే కనీసం శాపాంతం అయినా తెలుస్తుందని గురువర్యులు బృహస్పతి సలహా ఇచ్చిన మీదట ఈ పూజాయజ్ఞం తలపెట్టాడు. అంతా అనుకున్నట్లుగా జరిగింది, ఇక శ్రీమన్నారాయణుడు స్వయంగా విచ్చేసి, యజ్ఞఫలాన్ని స్వీకిరంచడమే తరువాయి అనుకుంటే ఇప్పుడిలా జరిగిందేమిటి? ఇదే సందేహాన్ని గురువర్యుల ముందుంచాడు. అప్పుడు బృహస్పతి ‘‘దేవేంద్రా! ఇప్పుడిక నీవే స్వయంగా వెళ్లి రమాపతిని ప్రార్థించి, సగౌరవంగా తోడ్కొని రావడం ఉత్తమం’’ అని సూచించాడు. దాంతో ప్రాణం కుదుటపడింది దేవేంద్రుడికి.
వెంటనే తన పరివారాన్ని వెంటబెట్టుకుని, నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ, వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠ ద్వారాలు తెరిచే ఉన్నాయి. పాలసముద్రం తెల్లగా తళతళలాడుతూనే ఉంది. ఆదిశేషువు తన పాన్పుతో సిద్ధంగానే ఉన్నాడు స్వామికి సేదదీర్చేందుకు. కానీ, నారాయణుడుంటేగా అక్కడ? ఒకవేళ ఆయనగారేమైనా ముక్కంటి వద్దకెళ్లాడేమోనన్న సందేహం వచ్చింది ఇంద్రుడికి. దాంతో అటునుంచి అటే కైలాసానికి పయనమయ్యాడు.
వెండికొండలు మిలమిలా మెరిసిపోతున్నాయి. మలయ మారుతం వీస్తోంది. సతీదేవి అద్భుతంగా గానం చేస్తుండగా, ఆనంద పారవశ్యంతో తాండవమాడుతున్నాడు శివయ్య. ఓం నమశ్శివాయ అంటూ భక్తితో దణ్ణం పెట్టి, తాము వచ్చిన కారణాన్ని విన్నవించారు స్వామికి. తళతళలాడుతున్న అర్ధనిమీలిత నేత్రాలను మెరిపిస్తూ కేశవుడి జాడ తనకు తెలిసినట్లుగా తెలియజెబుతూనే, మూసి ఉన్న మూడవకన్నును అటూ ఇటూ ఆడిస్తూ, ‘‘నారాయణుడి జాడను కనిపెట్టడం అంత సులువేమీ కాదు, నీవే వెళ్లి వెదుకు’’ అంటూ తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు ఈశ్వరుడు.
దాంతో అటునుంచి అటే సత్యలోకానికి వెళ్లాడు శచీపతి. వీరి రాకను ముందే గమనించినట్లుగా బ్రహ్మదేవుడు తన దర్శనభాగ్యం కూడా కల్పించకుండానే ‘‘ఇంద్రా! నీవు వెంటనే భూలోకానికి వెళ్లి, అన్వేషించు శ్రీహరి నీకు కనిపిస్తాడు’’ అంటూ సరస్వతితో చెప్పించాడు.ఉస్సురనుకుంటూ ఇంద్రుడు, పరివారమూ దివినుంచి భువిలో అడుగుపెట్టారు. అక్కడ అన్నిచోట్లా శ్రీహరి నిలువెత్తు కాంస్య విగ్రహాలు, పటాటోపపు పూజలు, ధగద్ధగాయ మానంగా మెరిసిపోతున్న రజత, సువర్ణ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి కానీ శ్రీహరి జాడ మాత్రం లేదు. ఇంతలోనే శ్రీమన్నారాయణుని లీలాగానం దివ్యంగా చెవిసోకింది. దాంతో దృష్టి అటు సారించి విస్మయంతో, తన కన్నులను తానే నమ్మలేనట్లుగా చూశాడు దేవేంద్రుడు. అక్కడ ఒక చర్మకారుడి చేతులు మాత్రం ఎవరివో చెప్పులు కుడుతున్నాయి. మనస్సు, వాక్కు మాత్రం శ్రీహరి మీదనే లగ్నమై, దివ్యంగా గానం చేస్తున్నాడు. మైమరచిపోయి వింటూ, పారవశ్యంతో తలపంకిస్తున్నాడు హరి. అప్పుడర్థమైంది ఇంద్రుడికి స్వామికి కావలసింది ఆడంబరపూజలు, కపట భక్తీ, హంగులూ, ఆర్భాటాలూ కావని, నిర్మల భక్తి, నిరాడంబర పూజలకే ప్రసన్నుడవుతాడనీ! పాహి పాహి అంటూ హరి చరణ కమలాలను పట్టుకున్నాడు ఇంద్రుడు.