మంచి కోసమే దారాలమ్మ ఆలయంలో పూజలు
సీలేరు, న్యూస్‌లైన్: శ్రీదారాలమ్మ ఆలయంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బుధవారం పంచాయతీ నిర్వహించారు. ఆలయంలో క్షుద్ర పూజలు చేసి, నరబలి ఇస్తున్నారని వారం రోజులుగా రేకెత్తిన ఆరోపణలకు ఎట్టకేలకు తెరపడింది. సీలేరులోని మారమ్మ ఆలయం లో పది గ్రామాల గిరిజనులు, పూజలు చేసిన అర్చకు లు, పూజలు చేయించిన వ్యక్తి సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
ఆలయంలో అమావాస్య రోజున పూజ లు చేయడం వాస్తవమేనని అర్చకులు తెలిపారు. మంచి పనికోసమే అమ్మవారికి కుంకుమ పూజ, హోమం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన బాల కృష్ణ అనే వ్యక్తి అమ్మవారికి ఈ విధంగా మొక్కుకోవడం వల్లే రాత్రి వేళల్లో పూజలు చేశామని వివరణ ఇచ్చారు. 101 పట్టు చీరలు కాల్చడం అవాస్తవమని, జాకెట్ ముక్కలు కాల్చడం జరిగిందని తెలిపారు.
నరబలులు, కోళ్లు కోయడం వంటివి హిందు సంప్రదాయ ప్రకారం నేరమని, అలాంటి పనులు తామెప్పుడు చేయలేదని వారు చెప్పారు. అమావాస్య రోజును గిరిజనులు చెడు గా భావిస్తారని, అలాంటి రోజున పూజలు చేయడమేమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. కొందరు అమావాస్యను చెడుగా భావించిన తాము పవిత్రంగా భావిస్తామని అందుకే ఆ రోజున పూజలు చేశామని పూజారులు తెలిపారు.
ఈ పంచాయతీకి దారకొండ, సీలేరు గ్రామపెద్దలు, ఇరు ప్రాంతాల ముఖ్య పురోహితులను తీసుకువచ్చి వారి సమక్షంలో విచారణ జరిపారు. అమ్మవారి ఆలయంపై వచ్చిన అపనిందలు పోగొడుతూ శాంతి జరిపేందుకు కుంకుమ పూజలు, లక్ష్మీపూజలు చేయాలని పురోహితులు సూచించారు. దీంతో అమ్మవారి భక్తు లు శాంతించి అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ పంచాయతీ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోలేదు. దారకొండ అటవీ ప్రాంతంలో లభించిన మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.