Sri Gautami
-
శ్రీగౌతమి హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బేరసారాలు
-
గౌతమి కేసులో మరో కీలక అడుగు
సాక్షి, పాలకొల్లు : శ్రీ గౌతమి హత్య కేసులో పోలీసులు మరో అడుగు ముందుకేశారు. కీలక నిందితుల్లో ఒకరైన డ్రైవర్ లక్ష్మణ రావును పాలకొల్లు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) కోర్టులో హజరుపరచనున్నారు. హత్య జరిగిన రోజు హంతకులతో పాటు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శ్రీ గౌతమి, పావనిలు నడిపే టూవీలర్‌ను హంతకులకు చూపి, ఫొటోలను అందించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న కూడా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట ఏడుగురు నిందితులకు సంబంధమున్నట్లు ప్రాధమికంగా భావించగా, ఇప్పుడు లక్ష్మణ రావుతో కలపి మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్, దుర్గాప్రసాద్‌లు టాటా సఫారీతో శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వారిద్దరి బెయిల్ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్లుగా కేసు మార్పు చేశారు. -
ఇదే శ్రీగౌతమి హత్యలో డీల్
-
ఇదే శ్రీగౌతమి హత్యలో డీల్
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీగౌతమి హత్యకేసులో ఎన్నో మలుపులు, మరెన్నో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. హత్యకు అసలు కిరాయి ఎంత అనేది అంతుచిక్కడం లేదు. అయితే ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పని చేసిపెట్టండి, విషయాలు అన్నీ చక్కబడ్డ తర్వాత ‘మీ ఇద్దరి లైఫ్‌లు ఊహించని రీతిలో సెటిల్ చేస్తాం..’ ఇదే శ్రీగౌతమి హత్యకేసులో సజ్జా బుజ్జి అండ్ కో కిరాయి హంతకులకు ఇచ్చిన హామీ అని తెలుస్తోంది. అంతేకాదు హత్యకు ఒప్పందం చేసుకున్న తర్వాత కిరాయి హంతకులకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. విశ్వశనీయ సమాచారం మేరకు పోలీసులు ఇప్పటివరకూ ఈ కేసులో ఛేదించిన అంశాలివి. కేసును మొదట్లో 15 రోజుల్లోనే క్లోజ్‌చేసి అపప్రద మూటకట్టుకున్న పశ్చిమ పోలీసులు ఈసారి సీబీసీఐడీ వెనుక ఉండటంతో ఆచితూచి ముందుకెళుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు రోజూ కేసు పురోగతిని సమీక్షిస్తున్నట్టు తెలిసింది. ఇన్విస్టిగేషన్ అధికారిగా ఉన్న పాలకొల్లు రూరల్ సీఐ బుధవారం నరసాపురం వచ్చి పలు ప్రాం తాల్లో దర్యాప్తు చేశారు. కెనరా బ్యాంకు, ఓ బ్యూటీపార్లర్‌తో పాటుగా పావని ఇంటికి కూడా వెళ్లి వివరాలు సేకరించారు. ఈ కేసుపై మరో పోలీస్ బృందం పనిచేస్తుంది. సజ్జా బుజ్జి ఇటీవల విపరీతంగా ఆస్తులు కొనుగోలు చేసిన పెరవలి మండలం కానూరు, నరసాపురం, దర్భరేవు, నవరసపురం ప్రాంతాల్లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముందుగానే రూ.15 లక్షల వరకూ ఖర్చు.. హత్యకు రూ.1.70 లక్షలతో కారు కొనిపెట్టడమే కాకుండా హత్యకు ముందు రూ.15 లక్షల వరకూ కిరాయి హంతకులకు సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్ ముట్టచెప్పారు. నరసాపురం కెనరా బ్యాంకులోని బుజ్జి ఖాతా నుంచి రూ.10 లక్షలు, బొల్లంపల్లి రమేష్ ఖాతా నుంచి రూ.5 లక్షలు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాలకొల్లు రూరల్ సీఐ రజనీకుమార్ నరసాపురం కెనరా బ్యాంకుకు వచ్చి వివరాలు సేకరించారు. అసలు నవంబర్ నెలలో హత్యకు స్కెచ్‌వేసి, జనవరిలో సంక్రాంతి సమయంలో అమలుచేయాలని ముందుగానే అనుకుని పక్కాగా ప్లాన్‌ను అమలు చేశారు. నవంబర్ నెల నుంచే లక్షల్లో సొమ్ములు ఖర్చుపెడుతుండటంతో కిరాయి హంతకులకు పూర్తిగా ధీమా వచ్చింది. ఈ హత్యలతో తమ జీవితాలు కచ్చితంగా సెటిల్ అయిపోతాయని భావించి శ్రీగౌతమిని యాక్సిడెంట్ మాటున హత్య చేశారు. ఇక ఈ కేసులో వైజాగ్‌కు చెందిన కిరాయి హంతకులు పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌తో పాటుగా బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మణ్ పరారీలోనే ఉన్నారు. వీరు ముగ్గురూ చిక్కితే కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరా ఎమ్మెల్యే? ఎవరీ బడా వ్యక్తులు ఈ కేసులో సజ్జా బుజ్జి అండ్ కోను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కొందరి వ్యక్తుల పేర్లుపై చర్చ జోరుగా సాగుతోంది. శ్రీగౌతమి హత్య తర్వాత పావని పోరాటం చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేసు నుంచి వైదొలిగేందుకు లక్షలు ఇప్పిస్తామంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే, బుజ్జి సామాజిక వర్గానికి చెందిన స్థానికులైన ఇద్దరు బడా వ్యక్తులు పావనిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలు స్తోంది. వారు ఎవరై ఉంటారనే దానిపైనా జోరుగా చర్చ సాగుతోంది. పావని వీరి గురించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. అయితే సీబీసీఐడీ వెనుకుండటంతో కేసును తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళుతున్న పోలీసులు ఈ బడాబాబుల విషయాలను వెలుగులోకి తెస్తారా? లేదా అనేది మరో ప్రశ్న. ఇక పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేది శ్రీ గౌతమి కేసుతో మరోసారి రుజువయ్యినట్టయ్యింది. ఈ విషయం ఇప్పటికే శ్రీగౌతమి హత్యకేసులో రోజురోజుకూ తెరమీదకు వస్తున్న కొత్త అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో ఎంత దారుణంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారో అర్థమవుతుంది. శ్రీ గౌతమి, బుజ్జి కాల్‌డేటాలు గాని, నిందితుడి బుజ్జి బ్యాంకు అకౌంట్లను కూడా పరిశీలించకుండానే అప్పట్లో కేసు మూసేశారు. అంటే పోలీసులపై ఎంతమేర ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి, ఏ స్థాయి వ్యక్తుల సిఫార్సులు ఉండి ఉంటాయనేది మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. -
శ్రీగౌతమి మృతిచెందిన కేసులో కీలక మలుపు
-
ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశారు
► శ్రీగౌతమి కళ్లముందే కదలాడుతోంది ► పథకం ప్రకారమే చంపేశారు ► లోకంలో న్యాయం లేదా ►డబ్బు లేనోళ్లం.. మగదిక్కు లేనోళ్లమని ఇంతకు తెగిస్తారా ►కన్నీటి పర్యంతమవుతున్న శ్రీగౌతమి తల్లి, చెల్లి జనవరి 24.. జాతీయ బాలికా దినోత్సవం. సరిగ్గా 24 ఏళ్ల క్రితం అదే రోజున శ్రీగౌతమి జన్మించింది. చదువుల తల్లిగా రాణించింది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సన్నద్ధమవుతోంది. అప్పటికే పరిచయమైన వ్యక్తి పన్నిన ఉచ్చులో పడింది. వివాహం పేరుతో అతడు ఆడిన కపట నాటకంలో బందీ అయ్యింది. మోసపోయానని తెలుసుకుని నిలదీసింది. చివరకు.. కారు ప్రమాదం పేరిట హత్యకు గురైంది. ఇలా ఆ ఇంటి దీపం ఆరిపోయింది. తల్లి.. చెల్లికి శూన్యం మిగిలింది. న్యాయం చేయండి మహాప్రభో అని ఆ రెండు గొంతులు దీనంగా అడుగుతున్నాయి. పోలీసుల అడుగులు మాత్రం ఎందుకో తడబడుతున్నాయి. వారి గోడు వినే సాహసం చేయలేకపోతున్నాయి. గొంతు సవరించుకుని 48 గంటల్లో విషయం తేల్చేస్తామని చెబుతున్నా.. ప్రజల అనుమానాలు ఇంకా అనుమానాలుగానే మిగిలిపోయాయి. నరసాపురం : మంగళవారం 25వ ఏట అడుగు పెట్టాల్సిన శ్రీగౌతమి.. ఈ లోకం విడిచి 7 రోజులైంది. ఈనెల 18వ తేదీ రాత్రి పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద కారు ఢీకొట్టడంతో శ్రీగౌతమి, ఆమె చెల్లెలు పావని గాయపడ్డారు. మగ దిక్కులేని ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆమె మృత్యువును గెలవలేకపోయింది. తీవ్ర గాయాల పాలైన శ్రీగౌతమి కొద్దిగంటల్లోనే తుదిశ్వాస విడిచింది. ఇదంతా రోడ్డు ప్రమాదం వల్ల జరిగిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ తరువాత మద్యం మత్తులో కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. ఇదే ఘటనలో గాయపడి ప్రాణాలతో బయటపడిన పావని నోరు విప్పేవరకూ అసలు విషయం బయటకు రాలేదు. తన అక్కను పథకం ప్రకారమే హత్య చేశారని.. టీడీపీ నాయకుడు సజ్జా బుజ్జి శ్రీగౌతమిని రహస్య వివాహం చేసుకున్నాడనే గుట్టువిప్పింది. వాళ్ల కుటుంబమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పింది. తన కుమార్తెను బుజ్జి కుటుంబమే మట్టుపెట్టిందని ఆమె తల్లి అనంతలక్ష్మి రోదిస్తోంది. ముందు ఇదంతా ఆకతాయిల పని అనుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కొందరు పెద్దలు.. తెరవెనుక ఉన్నది అధికార పార్టీ నేత అనే నిజం తెలిసి మొహం చాటేస్తున్నారు. మీ నోటికి తాళాలు వేసుకుని.. నిజాలను దాచకపోతే ఇబ్బందుల్లో పడతారంటూ బాధిత కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నాలూ సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యాయం కోసం శ్రీగౌతమి కుటుంబం ఎదురు చూస్తోంది. ‘కల్లబొల్లి మాటలు నమ్మి పెళ్లయిన వాడిని ప్రేమించడం మా అక్క తప్పే కావచ్చు. అందుకు చంపేస్తారా’ అని పావని ప్రశ్నిస్తుంటే.. ‘పెళ్లయిన వాడు మాయమాటలు చెప్పి మా అమ్మాయిని మోసం చేయడం తప్పు కాదా.. ఇప్పుడు మొదటి పెళ్లాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం దారుణం కాదా’ అని ఆమె తల్లి అనంతలక్ష్మి అడుగుతోంది. (ఐఏఎస్ కావాల్సిన యువతి...) అక్కలేదని తెలిసి నిజాన్ని బయటపెట్టిన పావని శ్రీగౌతమి.. చెల్లెలు పావని కలిసి స్కూటీపై నరసాపురం వైపు బయలుదేరారు. వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. గాయపడిన అక్కా, చెల్లెళ్లను నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్క శ్రీగౌతమి మృతిచెందగా, నాలుగు రోజుల తరువాత పావని కోలుకుంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు పావనికి అక్క శ్రీగౌతమి మృతి చెందిందన్న విషయం తెలియనివ్వలేదు. వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. దీంతో మొదట పావని తమను కారులో ఎవరో వెంబడించి ఢీకొట్టారని మాత్రమే తెలిపింది. మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలెవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అంతా భావించారు. ఆస్పత్రిలో కోలుకున్న పావని ఇంటికి వెళ్లిన తరువాత అక్క చనిపోయిందని తెలియడంతో.. తల్లికి కూడా తెలియని రహస్యాన్ని పావని బయటపెట్టింది. శ్రీగౌతమిని టీడీపీ నేత, వ్యాపారవేత్త సజ్జా బుజ్జి ప్రేమించాడని, రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడనే విషయాన్ని వెల్లడించింది. బుజ్జి భార్య శిరీష తరచూ శ్రీగౌతమిని వేధిస్తూ ఉండేదని చెప్పింది. పెళ్లి చేసుకున్న విషయాన్ని బయటపెట్టాలని బుజ్జిపై శ్రీగౌతమి వత్తిడి తెచ్చిందని వివరించింది. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం హత్య చేశారని విలపిస్తోంది. (మా అక్కది పక్కా హత్యే) అక్క.. చెల్లి.. తల్లి.. నరసాపురం కోవెల వీధిలో 25 ఏళ్లుగా శ్రీగౌతమి కుటుంబం జీవిస్తోంది. దంగేటి నరసింహరావు, అనంతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే నరసింహరావు ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మరణించారు. శ్రీగౌతమి చదువుల్లో ఫస్ట్. వైఎన్ కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసింది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగించేది. పాఠశాల స్థాయితోపాటు కళాశాలలోనూ క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొనేది. డిగ్రీలో ఉండగా 2013లో ఎన్సీసీ క్యాడెట్‌గా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొంది. సివిల్స్‌కు సమాయత్తయమ్యేందుకు రెండు నెలల క్రితం వైజాగ్ వెళ్లింది. సంక్రాంతి పండగ నిమిత్తం ఇంటికొచ్చి చివరకు అసువులు బాసింది. ఎక్కడికెళ్లినా.. కలిసే అక్కా చెల్లెళ్లిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టుగా మెలిగేవారు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. రాత్రి పూట ఇద్దరూ కలసి భోజనం చేసేవారు. తండ్రి లేకపోవడంతో తల్లికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తూ తమ కాళ్లమీద తాము నిలబడాలని ప్రయత్నించేవారు. ఈ నేపథ్యంలో అక్క మృతిని చెల్లెలు పావని తట్టుకోలేకపోతోంది. బాధిస్తున్న గాయాలతోపాటు మానని గాయం మిగిల్చి వెళ్లిపోయిన అక్కను తలుచుకుంటూ రోదిస్తోంది. జీవితంలో అన్నీ కోల్పోయాను జీవితంలో అన్నీ కోల్పోయాను. పిల్లలిద్దరినీ చూసుకుని బతుకుతున్నాను. భర్త చనిపోవడంతో ఇంటికి పెద్దది అయిన శ్రీగౌతమి మగ దిక్కులా ఉండేది. ఇంట్లోకి ఏం కావాలన్నా అదే తెచ్చేది. మనకు ఏమైనా కావాలంటే ఎవరు తెస్తారు. కొడుకైనా, కూతురైనా నేనే కదా అని ధైర్యం చెప్పేది. నాకిప్పుడు ఆ ధైర్యం లేదు. బిడ్డను దారుణంగా చంపేశారు. ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చాం. ఆ తరువాత మంగళవారం ఉదయం వరకు పోలీసులు మా దగ్గరకు రాలేదు. ప్రభుత్వం వారిపక్కన ఉంది. వాళ్లు పెద్దోళ్లు. మాకు అన్యాయం జరిగింది. న్యాయం చేసేవాళ్ల సాయం కావాలి. నా కూతురు ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు చెప్పాలి. లేదంటే కేసు పెట్టాలి. ఇలా చంపేస్తారా. లోకంలో న్యాయం లేదా. డబ్బులేనోళ్లం.. మగదిక్కు లేనోళ్లమనే కదా ఇలా చేశారు.– అనంతలక్ష్మి, శ్రీగౌతమి తల్లి