ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశారు | Sri Gautami's Death an Accident or Murder? | Sakshi
Sakshi News home page

ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశారు

Published Wed, Jan 25 2017 10:45 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశారు - Sakshi

ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశారు

శ్రీగౌతమి కళ్లముందే కదలాడుతోంది
పథకం ప్రకారమే చంపేశారు
లోకంలో న్యాయం లేదా
డబ్బు లేనోళ్లం.. మగదిక్కు లేనోళ్లమని ఇంతకు తెగిస్తారా
కన్నీటి పర్యంతమవుతున్న శ్రీగౌతమి తల్లి, చెల్లి


జనవరి 24.. జాతీయ బాలికా దినోత్సవం. సరిగ్గా 24 ఏళ్ల క్రితం అదే రోజున శ్రీగౌతమి జన్మించింది. చదువుల తల్లిగా రాణించింది. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సన్నద్ధమవుతోంది. అప్పటికే పరిచయమైన వ్యక్తి పన్నిన ఉచ్చులో పడింది. వివాహం పేరుతో అతడు ఆడిన కపట నాటకంలో బందీ అయ్యింది. మోసపోయానని తెలుసుకుని నిలదీసింది. చివరకు.. కారు ప్రమాదం పేరిట హత్యకు గురైంది. ఇలా ఆ ఇంటి దీపం ఆరిపోయింది. తల్లి.. చెల్లికి శూన్యం మిగిలింది. న్యాయం చేయండి మహాప్రభో అని ఆ రెండు గొంతులు దీనంగా అడుగుతున్నాయి. పోలీసుల అడుగులు మాత్రం ఎందుకో తడబడుతున్నాయి. వారి గోడు వినే సాహసం చేయలేకపోతున్నాయి. గొంతు సవరించుకుని 48 గంటల్లో విషయం తేల్చేస్తామని చెబుతున్నా.. ప్రజల అనుమానాలు ఇంకా అనుమానాలుగానే మిగిలిపోయాయి.

నరసాపురం :  మంగళవారం 25వ ఏట అడుగు పెట్టాల్సిన శ్రీగౌతమి.. ఈ లోకం విడిచి 7 రోజులైంది. ఈనెల 18వ తేదీ రాత్రి పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద కారు ఢీకొట్టడంతో శ్రీగౌతమి, ఆమె చెల్లెలు పావని గాయపడ్డారు. మగ దిక్కులేని ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆమె మృత్యువును గెలవలేకపోయింది. తీవ్ర గాయాల పాలైన శ్రీగౌతమి కొద్దిగంటల్లోనే తుదిశ్వాస విడిచింది. ఇదంతా రోడ్డు ప్రమాదం వల్ల జరిగిందని పోలీసులు చెప్పుకొచ్చారు.

ఆ తరువాత మద్యం మత్తులో కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. ఇదే ఘటనలో గాయపడి ప్రాణాలతో బయటపడిన పావని నోరు విప్పేవరకూ అసలు విషయం బయటకు రాలేదు. తన అక్కను పథకం ప్రకారమే హత్య చేశారని.. టీడీపీ నాయకుడు సజ్జా బుజ్జి శ్రీగౌతమిని రహస్య వివాహం చేసుకున్నాడనే గుట్టువిప్పింది. వాళ్ల కుటుంబమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పింది. తన కుమార్తెను బుజ్జి కుటుంబమే మట్టుపెట్టిందని ఆమె తల్లి అనంతలక్ష్మి రోదిస్తోంది.

ముందు ఇదంతా ఆకతాయిల పని అనుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేసిన కొందరు పెద్దలు.. తెరవెనుక ఉన్నది అధికార పార్టీ నేత అనే నిజం తెలిసి మొహం చాటేస్తున్నారు. మీ నోటికి తాళాలు వేసుకుని.. నిజాలను దాచకపోతే ఇబ్బందుల్లో పడతారంటూ బాధిత కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నాలూ సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యాయం కోసం శ్రీగౌతమి కుటుంబం ఎదురు చూస్తోంది. ‘కల్లబొల్లి మాటలు నమ్మి పెళ్లయిన వాడిని ప్రేమించడం మా అక్క తప్పే కావచ్చు. అందుకు చంపేస్తారా’ అని పావని ప్రశ్నిస్తుంటే.. ‘పెళ్లయిన వాడు మాయమాటలు చెప్పి మా అమ్మాయిని మోసం చేయడం తప్పు కాదా.. ఇప్పుడు మొదటి పెళ్లాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం దారుణం కాదా’ అని ఆమె తల్లి అనంతలక్ష్మి అడుగుతోంది.

(ఐఏఎస్ కావాల్సిన యువతి...)

అక్కలేదని తెలిసి నిజాన్ని బయటపెట్టిన పావని
శ్రీగౌతమి.. చెల్లెలు పావని కలిసి స్కూటీపై నరసాపురం వైపు బయలుదేరారు. వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. గాయపడిన అక్కా, చెల్లెళ్లను నరసాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్క శ్రీగౌతమి మృతిచెందగా, నాలుగు రోజుల తరువాత పావని కోలుకుంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు పావనికి అక్క శ్రీగౌతమి మృతి చెందిందన్న విషయం తెలియనివ్వలేదు. వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు.  దీంతో మొదట పావని తమను కారులో ఎవరో వెంబడించి ఢీకొట్టారని మాత్రమే తెలిపింది. మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలెవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అంతా భావించారు. ఆస్పత్రిలో కోలుకున్న పావని ఇంటికి వెళ్లిన తరువాత అక్క చనిపోయిందని తెలియడంతో.. తల్లికి కూడా తెలియని రహస్యాన్ని పావని బయటపెట్టింది. శ్రీగౌతమిని టీడీపీ నేత, వ్యాపారవేత్త సజ్జా బుజ్జి ప్రేమించాడని, రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడనే విషయాన్ని వెల్లడించింది. బుజ్జి భార్య శిరీష తరచూ శ్రీగౌతమిని వేధిస్తూ ఉండేదని చెప్పింది. పెళ్లి చేసుకున్న విషయాన్ని బయటపెట్టాలని బుజ్జిపై శ్రీగౌతమి వత్తిడి తెచ్చిందని వివరించింది. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం  హత్య చేశారని విలపిస్తోంది.

(మా అక్కది పక్కా హత్యే)

అక్క.. చెల్లి.. తల్లి..
నరసాపురం కోవెల వీధిలో 25 ఏళ్లుగా శ్రీగౌతమి కుటుంబం జీవిస్తోంది. దంగేటి నరసింహరావు, అనంతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే నరసింహరావు ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మరణించారు. శ్రీగౌతమి చదువుల్లో ఫస్ట్‌. వైఎన్‌ కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసింది. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగించేది. పాఠశాల స్థాయితోపాటు కళాశాలలోనూ క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొనేది. డిగ్రీలో ఉండగా 2013లో ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ పరేడ్‌లో పాల్గొంది. సివిల్స్‌కు సమాయత్తయమ్యేందుకు రెండు నెలల క్రితం వైజాగ్‌ వెళ్లింది. సంక్రాంతి పండగ నిమిత్తం ఇంటికొచ్చి చివరకు అసువులు బాసింది.

ఎక్కడికెళ్లినా.. కలిసే
అక్కా చెల్లెళ్లిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టుగా మెలిగేవారు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. రాత్రి పూట ఇద్దరూ కలసి భోజనం చేసేవారు. తండ్రి లేకపోవడంతో తల్లికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తూ తమ కాళ్లమీద తాము నిలబడాలని ప్రయత్నించేవారు. ఈ నేపథ్యంలో అక్క మృతిని చెల్లెలు పావని తట్టుకోలేకపోతోంది. బాధిస్తున్న గాయాలతోపాటు మానని గాయం మిగిల్చి వెళ్లిపోయిన అక్కను తలుచుకుంటూ రోదిస్తోంది.

జీవితంలో అన్నీ కోల్పోయాను
జీవితంలో అన్నీ కోల్పోయాను. పిల్లలిద్దరినీ చూసుకుని బతుకుతున్నాను. భర్త చనిపోవడంతో ఇంటికి పెద్దది అయిన శ్రీగౌతమి మగ దిక్కులా ఉండేది. ఇంట్లోకి ఏం కావాలన్నా అదే తెచ్చేది. మనకు ఏమైనా కావాలంటే ఎవరు తెస్తారు. కొడుకైనా, కూతురైనా నేనే కదా అని ధైర్యం చెప్పేది. నాకిప్పుడు ఆ ధైర్యం లేదు. బిడ్డను దారుణంగా చంపేశారు. ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చాం. ఆ తరువాత మంగళవారం ఉదయం వరకు పోలీసులు మా దగ్గరకు రాలేదు. ప్రభుత్వం వారిపక్కన ఉంది. వాళ్లు పెద్దోళ్లు. మాకు అన్యాయం జరిగింది. న్యాయం చేసేవాళ్ల సాయం కావాలి. నా కూతురు ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు చెప్పాలి. లేదంటే కేసు పెట్టాలి. ఇలా చంపేస్తారా. లోకంలో న్యాయం లేదా. డబ్బులేనోళ్లం.. మగదిక్కు లేనోళ్లమనే కదా ఇలా చేశారు.– అనంతలక్ష్మి, శ్రీగౌతమి తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement