ఈ కేసులో సజ్జా బుజ్జి అండ్ కోను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కొందరి వ్యక్తుల పేర్లుపై చర్చ జోరుగా సాగుతోంది. శ్రీగౌతమి హత్య తర్వాత పావని పోరాటం చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేసు నుంచి వైదొలిగేందుకు లక్షలు ఇప్పిస్తామంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే, బుజ్జి సామాజిక వర్గానికి చెందిన స్థానికులైన ఇద్దరు బడా వ్యక్తులు పావనిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలు స్తోంది. వారు ఎవరై ఉంటారనే దానిపైనా జోరుగా చర్చ సాగుతోంది.
పావని వీరి గురించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. అయితే సీబీసీఐడీ వెనుకుండటంతో కేసును తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళుతున్న పోలీసులు ఈ బడాబాబుల విషయాలను వెలుగులోకి తెస్తారా? లేదా అనేది మరో ప్రశ్న. ఇక పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేది శ్రీ గౌతమి కేసుతో మరోసారి రుజువయ్యినట్టయ్యింది. ఈ విషయం ఇప్పటికే శ్రీగౌతమి హత్యకేసులో రోజురోజుకూ తెరమీదకు వస్తున్న కొత్త అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో ఎంత దారుణంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారో అర్థమవుతుంది. శ్రీ గౌతమి, బుజ్జి కాల్‌డేటాలు గాని, నిందితుడి బుజ్జి బ్యాంకు అకౌంట్‌లను కూడా పరిశీలించకుండానే అప్పట్లో కేసు మూసేశారు. అంటే పోలీసులపై ఎంతమేర ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి, ఏ స్థాయి వ్యక్తుల సిఫార్సులు ఉండి ఉంటాయనేది మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది.