Sri Sai Baba Sansthan Trust
-
షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం
షిర్డీ: హైదరాబాద్కు చెందిన డాక్టర్ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు. ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు. -
షిర్డి ఆలయ చైర్మన్ పదవి బీజేపీకి!
షిర్డి: షిర్డిలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ పదవిని బీజేపీకి కట్టబెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముంబై లో ప్రఖ్యాతిగాంచిన సిద్ధివినాయక దేవాలయం చైర్మన్ పదవి శివసేన పార్టీకి దక్కనున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చిం దని రాష్ట్రమంత్రి రామ్ షిండే శనివారం మీడియాతో అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలయ్యాక ఆలయాల ట్రస్టీల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. షిర్డి సాయిబాబా సమాధి చెంది 2018నాటికి వందేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా అప్పుడు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీ నిధులను కేటాయించాల్సి ఉందని ఆయన అన్నారు. నిలిచిపోయిన షిర్డి రహదారుల పనులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.