విద్యను నిర్లక్ష్యం చేయొద్దు
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, ప్రముఖ నటుడు మోహన్‌బాబు
ఘట్కేసర్: విద్యకు అంత్యంత ప్రాధాన్యం ఇస్తానని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, ప్రముఖ నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. పోచారం పంచాయతీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో ఉన్న శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో శనివారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధికి విద్య ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
విద్యను నిర్లక్ష్యం చేయరాదన్నారు. తన విద్యా సంస్థల్లో కులమతాలకు అతీతంగా 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలను మో సం చేసే రాజకీయనాయకులు, విద్యార్థులను మోసం చేసే ఉపాధ్యాయులు మనుగడ సాధించలేరన్నారు. తన అసలు పేరు భక్తవత్సలం అని, దానిని తన గురువు దాసరి నారాయణరావు మోహన్‌బాబుగా మార్చారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువులు, తల్లిదండ్రుల పాత్ర చాల కీలకమైందన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి రాంరెడ్డి, టౌన్షిప్ అధ్యక్షుడు హరిప్రసాద్ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.